Mumbai : అభివృద్ధి చెందుతున్న దేశమని గర్వంగా చెప్పుకుంటున్నప్పటికీ ఇంకా కులాల పేరుతో జరుగుతున్న దారుణాలు మాత్రం తగ్గడం లేదు. ఉన్నత చదువులు చదువుకుంటున్న విద్యార్ధుల్లోనూ కుల పిచ్చి పాతుకుపోయింది. కొంత మంది ఆకతాయి కుర్రాళ్ళ వెకిలిచేష్టలకు, వేధింపులకు ఓ నిండు ప్రాణం బలైంది. ఐఐటీ బొంబాయిలో 18 ఏళ్ల దళిత విద్యార్థి దర్శన్ సోలంకి ఆత్మహత్య చేసుకున్నాడు. తన కులం కారణంగా అతని స్నేహితులు అతనిని బహిష్కరిస్తున్నారని ఈ విషయాన్ని ఆత్మహత్యకు ముందు తన సోదరి , అత్తతో మాట్లాడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. క్యాంపస్‌లో ఎలాంటి వివక్ష లేదని ఐఐటీ బాంబే అధికారులు చెబుతుండగా, దర్శన్ సోలంకి కుటుంబం మాత్రం అతను వేధింపులను ఎదుర్కొన్నాడని పేర్కొంది.

గత నెలలో దర్శన్ సోలంకి ఇంటికి వచ్చినప్పుడు, క్యాంపస్‌లో కుల వివక్ష ఉందని నాకు, అమ్మ-నాన్నలకు చెప్పాడు అని , తాను షెడ్యూల్డ్ కులానికి చెందినవాడని అతని స్నేహితులకు తెలియడంతో అతని పట్ల వారి ప్రవర్తన మారిపోయిందని దర్శన్ సోలంకి సోదరి జాన్వీ సోలంకి తెలిపింది. కాస్ట్ కారణంగా వారు అతనితో మాట్లాడటం మానేశారని, తనతో తిరగడం మానేశారు అని సోదరి పోలీసులకు చెప్పుకొచ్చింది. కులం పేరుతో వేధించడంతో దర్శన సోలంకి తీవ్ర మనోవేధనకు గురయ్యాడని, అతడిని హింసించారిని అందుకే అతను ఇలా చేశాడని తన తల్లి తర్లికాబెన్ సోలంకి తెలిపింది.

ఇక దర్శన్ అత్త మాట్లాడుతూ , నెల రోజుల క్రితం తన దగ్గరికి దర్శన్ వచ్చినప్పుడు నేను ఉచితంగా చదువుతున్నానంటే చాలా మంది విద్యార్థులు ఇష్టపడరని చెప్పాడని చాలా మంది విద్యార్థులు నన్ను చూసి అసూయపడుతున్నారు అని చెప్పాడని తెలిపింది. దర్శన్ చనిపోవడానికి కొన్ని గంటల ముందు తన కొడుకుతో మాట్లాడినట్లు దర్శన్ తండ్రి రమేష్ భాయ్ సోలంకి తెలిపారు. కానీ ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని అసలు ఊహించలేదన్నారు.

దర్శన్ సోలంకి కుల వివక్షతను ఎదుర్కొన్నాడన్న ఆరోపణలను ఐఐటీ ముంబై తోసిపుచ్చింది. అతని మరణంపై దర్యాప్తు జరుగుతోందని తెలిపింది.
బీటెక్ మొదటి ఏడాది చదువుతున్న దర్శన్ విషాద మరణం గురించి కొన్ని వార్తా కథనాలలోని వాదనలను ఐఐటీ ముంబై గట్టిగా ఖండించింది.
ఆదివారం హాస్టల్ భవనంలోని ఏడో అంతస్తు నుంచి దూకి దర్శన్ మృతి చెందడంతో పోలీసులు ప్రమాదవశాత్తు మృతి చెందారని కేసు నమోదు చేశారు. తమకు ఇంకా సూసైడ్ నోట్ లభించలేదని, అయితే క్యాంపస్‌లో దళిత విద్యార్థులపై వివక్ష చూపడం వల్లే దర్శన్ ఆత్మహత్యకు పాల్పడ్డారని విద్యార్థి సంఘం ఆరోపిస్తోంది.