Munugodu : తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే.. అది మునుగోడు. ఇక్కడి ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పార్టీకి తన పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక ఖాయంగా మారింది. ఇంతకు ముందు కూడా పలు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. అప్పట్లో అవి కూడా హాట్ టాపిక్ అయ్యాయి. అవి వేరే విషయం. ఇది మాత్రం గత ఉప ఎన్నికలకు మించి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక్కడి విజయం మూడు కీలక పార్టీలు.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చాలా ముఖ్యం. రాజగోపాల్ రెడ్డి తమ పార్టీని కాదనుకుని వేరే పార్టీలోకి వెళుతున్నాడు కాబట్టి ఇక్కడ గెలిచి రాజగోపాల్ రెడ్డి వల్ల తమకు ఒరిగిందేం లేదని నిరూపించాలని కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నిస్తోంది.
ఇక బీజేపీ, టీఆర్ఎస్‌లకైతే టగ్ ఆఫ్ వార్. ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీదే అధికారం అన్న భావన బలపడుతోంది. దీంతో ఈ రెండు పార్టీలు చావో.. రేవో అన్నట్టుగా తలపడనున్నాయి. మునుగోడులో టీఆర్ఎస్ ఓడి.. బీజేపీ గెలిస్తే.. రాష్ట్రంలో ఆ పార్టీ బలంగా ఉందన్న భావన జనంలో బలపడుతుందని.. దీంతో ఆ ఎఫెక్ట్ అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ గెలిస్తే తమకు అసెంబ్లీ ఎన్నికల్లో నష్టం చేకూరుతుందన్న భావన బీజేపీలోనూ ఉంది. దీంతో రాష్ట్రంలో అధికారం సాధించాలంటే మునుగోడు విజయం అత్యవసరమని బీజేపీ అధిష్టానం సైతం భావిస్తోంది.
Munugodu : రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ప్రకటించిన 10 నిమిషాల్లోనే..
ఈ క్రమంలోనే కాంగ్రెస్ సైతం మునుగోడు ఉపఎన్నికపై దృష్టి సారించింది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్వయంగా ఈ ఏడు మండలాల కార్యకర్తలు, అభిమానుల సమావేశాలకు హాజరుకానున్నారు. వచ్చేవారంలో ఈ సమావేశం ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో మునుగోడు ఉప ఎన్నిక వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు ఒక సమన్వయ కమిటీని ఆ పార్టీ నియమించింది. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేస్తున్నానని ప్రకటించిన 10 నిమిషాల్లోనే మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మాజీ ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్, బలరాం నాయక్, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఇరావత్రి అనిల్‌కుమార్, సంపత్‌కుమార్ సభ్యులుగా ఉన్నారు. మొత్తానికి ఇక్కడ విజయం సాధించి రాజగోపాల్‌రెడ్డికి బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ గట్టిగానే భావిస్తోంది.