ఏపీలో రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉన్న జనసేన టిడిపి పార్టీలు పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ రణస్థలంలో యువశక్తి సభ వేదికగా సమీకరణాలు అనుకూలిస్తే పొత్తుతో ముందుకు వెళ్తామని చెప్పకనే చెప్పారు. అయితే తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ పెట్టిన ప్రపోజల్ పై ఏ విధంగా కూడా స్పందించలేదు. పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్న సీట్లు సంఖ్య ఎక్కువగా ఉన్నాయనే మాట టిడిపి వర్గాలలో వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వారు వేచి చూసే ధోరణిలో ఉన్నారు.
అయితే అధికార పార్టీతో పాటు, అధికార పార్టీకి సపోర్ట్ గా ఉండే రాజకీయ విశ్లేషకులు, మీడియా చానల్స్ మాత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని గెలిపించడానికి తన ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేస్తున్నారని ఊదరగొడుతున్నారు. దీని ద్వారా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. జనసేనని ముఖ్యమంత్రిగా అయితే సపోర్ట్ ఇచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పీఠాన్ని త్యాగం చేస్తే జనసేన కేడర్లో కూడా చాలామంది అసంతృప్తితో ఉండే అవకాశం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ వ్యూహాలను తనకి వదిలేయాలని పదేపదే కార్యకర్తలకు చెప్పడం ద్వారా తాను ఏం చేసినా సరైన నిర్ణయం తీసుకుంటానని సందేశాన్ని జనసేన కేడర్లోకి బలంగా పంపిస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా కర్నూలులో జనసేన సమావేశం జరిగింది. ఇందులో భాగంగా నాగబాబుకి పొత్తుల విషయంపై మీడియా నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే పొత్తుపై ఎలా ముందుకు వెళ్లాలనేది అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారని నాగబాబు తేల్చేశారు. పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్న కచ్చితంగా జనసేన పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకుంటారని క్యాడర్ కి కూడా మరోసారి గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు. నాయకులు అందరూ కూడా గ్రామస్థాయిలో క్యాడర్ ని పటిష్టం చేసే ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ బిజెపిని కలుపుకొని తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నారు. అలాగే అధికారంలో కూడా భాగస్వామ్యం కోరుకుంటున్నారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ జనసేనకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఈ విషయం వైసిపి వర్గాలకు కూడా తెలిసిన నేపథ్యంలోనే జనసైనికులను రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అనే విధంగా ప్రచారాన్ని తెరపైకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీని ద్వారా కచ్చితంగా పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ప్రకటించకపోతే జనసేన క్యాడర్లో అసంతృప్తి పెరిగేలా వ్యూహాత్మకంగా ఎదురు దాడి చేస్తున్నారు.