యువగళం పాదయాత్రలో నారా లోకేష్ రెండో రోజు 9.3 కిలోమీటర్లు నడించారు. ఈ పాదయాత్రలో అడుగడుగున ప్రజలు అతనికి బ్రహ్మరథం పట్టారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొని నారా లోకేష్ వెంట నడించారు. ఇక రెట్టించిన ఉత్సాహంతో లోకేష్ యాత్రని కొనసాగిస్తున్నారు. ఇక రెండో రోజు పాదయాత్రలో భాగంగా జరిగిన సభలో వైసీపీ ప్రభుత్వం, ఎమ్మెల్యేలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికలలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యలో ముందు ఒక నెంబర్ లేదంటే లాస్ట్ లో ఒక నెంబర్ ఎగిరిపోతుందని, అయితే ఎన్ని వస్తాయనేది చూడాలని ఆసక్తికరంగా కామెంట్స్ చేశారు.
చంద్రబాబు హయాంలో 34 శాతానికి పెంచిన బీసీల రిజర్వేషన్ ని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గించేసారని నారా లోకేష్ విమర్శించారు. ఈ పని చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని అన్నారు. 10 రూపాయిలు ఇచ్చి ప్రజల నుంచి 100 రూపాయిలు వసూలు చేయడం జగన్ రెడ్డి శైలి అని, దానిని ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. వచ్చే ఎన్నికలలో బీసీలు కచ్చితంగా జగన్ కి గుణపాఠం చెప్పాలని కోరారు. అసెంబ్లీలో తన తల్లిని అవమానించి మాట్లాదారాని, అందుకే రాముడు లాంటి చంద్రబాబులో కూడా మార్పు వచ్చిందని, రాముడే వారు అంతు తెలుస్తాడని వైసీపీపై ఘాటుగా విమర్శలు చేశారు.
దొంగతనం చేస్తే కోర్టుకి వెళ్ళేవారు ఉంటారు. అయితే కోర్టులోనే దొంగతనం చేసిన ఘనత వైసీపీ మంత్రిది అంటూ కాకానిపై వ్యంగ్యంగా నారా లోకేష్ విమర్శలు చేశారు. తాము అధికారంలోకి రాగానే రైతులకి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు మోటార్ మీటర్లని తొలగించే పని చేస్తామని ప్రజలకి హామీ ఇచ్చారు. అలాగే చంద్రబాబు జీవితాంతం కుప్పం నుంచే పోటీ చేస్తారని, అలాగే తాను మళ్ళీ మంగళగిరిలోనే పోటీ చేస్తానని, బాలకృష్ణ కూడా హిందూపూర్ నుంచి బరిలోకి దిగుతారని ఇందులో ఎలాంటి మార్పు ఉండదని నారా లోకేష్ చెప్పడం కొసమెరుపు.