ఏపీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేయబోతున్న సంగతి తెలిసిందే. యువగళం పేరుతో చేస్తున్న ఈ పాదయాత్ర ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ యాత్ర ద్వారా నారా లోకేష్ రాష్ట్రం వ్యాప్తంగా 4 వేల కిలోమీటర్లు నడవబోతున్నారు. ఈ యాత్రతో యువతకి దగ్గరయ్యే ప్రయత్నం నారా లోకేష్ చేస్తున్నారు. ఇదిలా ఈ పర్యటన కుప్పం నుంచి ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశారు, తరువాత చంద్రబాబు చేశారు. వైఎస్ జగన్ కూడా పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి అధికారాన్ని హస్తగతం చేస్తున్నారు. ఇప్పుడు అదే సెంటిమెంట్ తనకి కలిసి వస్తుందని నారా లోకేష్ పాదయాత్ర చేయబోతున్నాడు.
ఇక ప్రజల నుంచి పెద్ద ఎత్తున తన పాదయాత్రకి మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు. అయితే అధికార పార్టీ వైసీపీ ఈ పాదయాత్రని అడ్డుకోవడానికి వ్యూహాలు వేస్తుంది. ఇదిలా ఉంటే పాదయాత్ర శుక్రవారం నుంచి ప్రారంభం కాబోతున్న నేపధ్యంలో నారా లోకేష్ ప్రజలకి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో వైసీపీ ప్రభుత్వంపై, జగన్ రెడ్డి పాలనపై నారా లోకేష్ నిప్పులు చెరిగారు. తన పాదయాత్రకి ప్రజల ఆశీర్వాదాలు కావాలని పేర్కొన్నాడు. నవ్యాంద్ర నిర్మాణం కోసం తన తండ్రి చంద్రబాబు ఎంతో కృషి చేస్తే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి మొత్తం ఆగిపోయిందని, రాష్ట్రాన్ని విద్వంసం చేశారని పేర్కొన్నారు.
పోలీసు వ్యవస్థని కూడా పులివెందుల రాక్షస రాజ్యాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేసేందుకు జగన్ రెడ్డి ప్రైవేట్ సైన్యంగా ఉపయోగించుకుంటూ ఉన్నాడని విమర్శించారు. పరిశ్రమలు స్థాపించడానికి వచ్చే వారిని భయపెట్టి ఇతర రాష్ట్రాలకి తరలిపోయేలా చేసారని అన్నారు. రైతులకి కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని, ఉద్యోగులకి సకాలంలో జీతాలు ఇవ్వడం లేదని విమర్శించారు. వీటన్నింటికి ముగింపు పలికి మళ్ళీ టీడీపీ అధికారంలోకి రావడం ద్వారా సుపరిపాలన అందించడానికి చేస్తున్న ఈ పాదయాత్రకి మద్దతు ఇవ్వాలని కోరాడు.