నెల్లూరు జిల్లా కావలిలో దళితులపై వైసీపీ నాయకులు దాడులకి పాల్పడుతూ వారిని ఇబ్బందులకి గురి చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ పెట్రోల్ బంక్ లో దళితుడిపై వైసీపీ ఎంపీటీసీ దారుణంగా దాడి చేసి కొట్టారు. గతంలో టీడీపీ పార్టీకి చెందిన దళిత యువ నాయకుడిని ఎమ్మెల్యే వేధింపులకి గురిచేయడంతో అతను ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఆత్మహత్యాయత్నం చేశారు. అలాగే వైసీపీ నాయకుల వేధింపులకి ఇద్దరు దళితులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా వరుసగా దళితులపై జరుగుతున్న దాడులకి నిరసనగా కావలి టీడీపీ నాయకులు చలో కావలికి పిలుపునిచ్చారు. అయితే దీనిపై పోలీసులు కఠిన ఆంక్షలు విధించి రోడ్డు మీదకి రాకుండా ఎక్కడికక్కడ టీడీపీ నాయకులని అరెస్ట్ చేశారు.
టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజుని పోలీసులు అరెస్ట్ చేసి ఎక్కడికో తరలించారు. మరికొంత మంది టీడీపీ నాయకులని కూడా అరెస్ట్ చేశారు. ఇలా టీడీపీ నాయకులని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేయడంపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఛలో కావలి’ కార్యక్రమాన్ని అణచివేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వైసీపీ నేతలు చెప్పినట్లు పోలీసులు చేస్తున్నారని, జగన్ రెడ్డి సైకో పాలనలో ప్రజలని, ప్రతిపక్షాలని అణచివేయడం, వేధింపులకి గురిచేయడమే పనిగా పెట్టుకున్నారని ద్వజమెత్తారు.
ఎంఎస్ రాజుతోపాటు అరెస్ట్ చేసిన ఉద్యమకారులపై పోలీసులు తప్పుడు కేసులు బనాయించి కుట్రపూరితంగా అరెస్ట్ చేసారని అన్నారు. పోలీసులు తక్షణం వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే చలో కావలిని అడ్డుకొని తమ నాయకులని గృహ నిర్భంధం చేయడంపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేస్తున్న అరాచకాలకి కచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారని అన్నారు. ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అరాచకాలకి అండగా ఉంటూ వైసీపీ నాయకులకి వంతపాడుతున్న పోలీసులు కూడా కచ్చితంగా సమాధానం చెప్పే రోజు వస్తుందని విమర్శించారు.