Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత రెండు నెలలుగా ఏపీ రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో యాక్టివ్ లేరని చెప్పాలి. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ట్వీట్ లు పెడుతూ తన ఉనికిని చూపిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేయడం లేదని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. వరుసగా సినిమాలు కమిటై షూటింగ్ లు చేస్తున్న పవన్ కళ్యాణ్ వాటిని పూర్తిచేసే పనిపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా కొంత స్తబ్దుగా ఉన్న మాట వాస్తవమే. అయితే ప్రస్తుతం ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు జోరుగా తమ వ్యూహాలను అమలు చేసుకుంటూ ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాయి. ప్రజలకు చేరువయ్యేందుకు తమకున్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు.
ఓ విధంగా చెప్పాలంటే ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో అధికార ప్రతిపక్ష పార్టీ నాయకుల వ్యవహార శైలిని చూస్తున్న ప్రజలు కొంత విసిగిపోయి ఉన్నారనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ బలంగా ప్రజల్లోకి వెళ్లి తన ఉనికిని నిరూపించుకుంటే అధికారంలోకి కూడా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి రాజకీయ కార్యాచరణ లేకుండా నిశ్శబ్దంగా ప్రస్తుత పరిణామాలను చూస్తూ ఉన్నారని మాట వినిపిస్తోంది.
ఇప్పటివరకు నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు అనేది కూడా జనసేన పార్టీకి స్పష్టమైన క్లారిటీ లేదు అనేది కొంతమంది చేసే విమర్శలు. అయితే దీనికి సరైన సమాధానం మాత్రం పవన్ కళ్యాణ్ ఇవ్వలేదని చెప్పాలి. వ్యూహాలు తనకి వదిలేయాలంటే జనసైనికులకి భరోసా అయితే ఇస్తున్నారు కానీ ప్రజాక్షేత్రంలో బలంగా నిలబడడంలో ఎందుకనో తడబడుతున్నట్లుగా రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తుంది. మార్చిలో జరగబోయే జనసేన ఆవిర్భావ సభ తర్వాత అయినా పవన్ కళ్యాణ్ ప్రజా క్షేత్రంలో కొచ్చి యాక్టివ్ అవుతారా లేదా అనేది వేచి చూడాలి.