Paidi Jayaraj : ప్యాన్ ఇండియా మూవీ.. ప్యాన్ ఇండియా స్టార్. ఇటీవలి కాలంలో బాగా ఎక్కువగా వినిపిస్తున్న పదాలివి. ఒకప్పుడు భారీ సినిమా తీయాలంటే బాలీవుడ్ వారు తీయాల్సిందే. లేదంటే హాలీవుడ్ వారికి సాధ్యం. బాలీవుడ్‌కి ఇంత క్రేజ్ పెరగడానికి కూడా ఇదే కారణం. కానీ ఇప్పుడు టైమ్ మారింది.. టైమింగ్ మారింది.. టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్యాన్ ఇండియా మూవీస్‌కి కేరాఫ్‌గా మారుతోంది. సౌత్ ఇండియాలోనే అతి పెద్ద చిత్రపరిశ్రమగా టాలీవుడ్ ఎదిగింది. ఇటీవలి కాలంలో తెలుగు ఇండస్ట్రీ నుంచి తొలి ప్యాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్ అవతరించాడు. ఆ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటివారు ప్యాన్ ఇండియా చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.
అయితే మన ఇప్పటి స్టార్ హీరోలకంటే ముందు ప్యాన్ ఇండియా స్థాయిలో తమ ప్రభావం చూపించిన పాత తరం హీరోలు ఎవరైనా ఉన్నారా? అనేది ఆసక్తికరంగా మారింది. లేకపోవడమేంటి? ఇప్పుడు కాదు.. మూకీ సినిమాల టైం నుంచే ఉన్నారు. తెలుగులో తొలి ప్యాన్ ఇండియా స్టార్ పేరు పైడి జైరాజ్. 1909 సెప్టెంబర్ 28వ తేదీన కరీంనగర్‌లో ఆయన జన్మించారు. మూకీల చివరిలో.. టాకీల మొదట్లో ఆయన తెరపై సందడి చేశారు కాబట్టి దాదాపు ఈ తరం ప్రేక్షకులకు ఆయన తెలిసే అవకాశం లేదు. తెలుగువాడైనప్పటికీ తెలుగు సినిమాలు చేయకపోవడం వలన మనకి ఆయన గురించి తెలిసే అవకాశం రాలేదు.
Paidi Jayaraj : నాగయ్యతో కలిసి సినిమా చేస్తుండగానే..
సినిమా ఇండస్ట్రీ.. మద్రాసు, బొంబాయి, కలకత్తాల చుట్టూ తిరుగుతున్న సమయంలోనే ఆయన ప్యాన్ ఇండియా దిశగా అడుగులు వేశారు. జైరాజ్ తొలుత ఫైట్ మాస్టర్‌గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మంచి దేహ ధారుడ్యం, అందంగా ఉండటంతో ఆ తరువాత హీరోగా మారిపోయారు. మూకీలలో ఆయన తొలి మూవీ ‘రసిలీ రాణి’ .. టాకీలలో తొలి సినిమా ‘షికారీ’. సాంఘిక, జానపద, చారిత్రక యాక్షన్ సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు. అప్పట్లోనే గుర్రపుస్వారి .. కత్తి యుద్ధంలో ఆరిరారు. ఫైట్ మాస్టర్ కావడంతో ఫైటింగ్ సీన్స్‌తో బాగా ఆకట్టుకునేవారు. అంతేకాకుండా 1960లలోనే తొలిసారిగా ప్రేక్షకులకు ‘సూపర్ మేన్’ ను జైరాజ్ పరిచయం చేశారు. హిందీ .. ఉర్దూ .. ఇంగ్లిష్ .. మరాఠీ .. గుజరాతి భాషలలో కలుపుకుని 300 వరకూ సినిమాలు చేశారు. అయినప్పటికీ జైరాజ్ తెలుగులో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. చిత్తూరు నాగయ్యతో కలిసి ఒక ప్రాజెక్ట్ అనుకున్నప్పటికీ నాగయ్య చనిపోవడంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. జైరాజ్ ఆగస్టు 11 .. 2000లలో ముంబైలో కన్నుమూశారు.