Love Story : పాకిస్థాన్ అమ్మాయి, హైదరాబాదీ అబ్బాయి.. ఆన్లైన్లో పరిచయం కాస్తా ప్రేమగా మారింది.. సీన్ కట్ చేస్తే అనుకోని ఘటన.. తీస్తే పెద్ద సినిమాయే అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్‌పురాకు చెందిన అహ్మద్ అనే యువకుడికి పాకిస్థాన్‌లోని పైసలాబాద్‌కు చెందిన ఖలీజా నూర్ అనే యువతితో ఆన్లైన్లో పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా వీరిద్దరి మధ్య నడుస్తున్న ఛాటింగ్‌తో ప్రేమలో పడ్డారు. మొత్తానికి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కానీ ఈ పెద్దోళ్లున్నారే.. పిల్లల మనసును ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఇక్కడ కూడా సేమ్ జరిగింది. వీరిద్దరికి పెళ్లికి ససేమిరా అన్నారు. దీంతో చేసేదేమీ లేక ఖలీజానూర్ తన ప్రియుడి కోసం ఇండియాకు వచ్చేసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించింది.
తన ప్రేమ, పెళ్లి కోసం ఇండియాకు వచ్చేస్తానని అహ్మద్‌కు ఖలీజానూర్ తెలిపింది. వెంటనే అతడు తన సోదరుడు మహమూద్ సాయం కోరాడు. ఇద్దరూ కలిసి నేపాల్‌కి చెందిన జీవన్ సాయం తీసుకున్నారు. మొత్తానికి తన ప్రియురాలిని ఎలాగోలా ప్రియురాలిని ఇండియాకు తీసుకురావాలని డిసైడ్ అయ్యాడు. తన ప్రియురాలిని పాక్ దేశ సరిహద్దులు దాటించి హైదరాబాద్ తీసుకురావాలని స్కెచ్ గీశాడు. వీరంతా కలిసి ఖలీజా నూర్ పేరుతో నకిలీ ఆధార్ కార్డుతో సహా ఇతర పత్రాలు సృష్టించారు. ఖలీజా నూర్‌ను నేపాల్ మీదుగా ఇండియాలోకి తీసుకురావాలని పథకం వేశారు. మహమూద్ నేపాల్‌కి వెళ్లి ఖలీజాను అక్కడికి రప్పించాడు. వీరు ముగ్గురూ కలిసి ఈ నెల 8న భారత్ – నేపాల్ సరిహద్దు ప్రాంతమైన బీహార్‌లోని సుర్సంద్ వద్దకు చేరుకున్నారు. సీన్ కట్ చేస్తే.. అక్కడి నుంచి దేశంలోని చొరబడుతూ ఇండియన్ ఆర్మీకి చిక్కారు.
Love Story : లవ్ స్టోరీపై దృష్టి సారించిన ఇంటెలిజెన్స్
ఇక ఆర్మీ వదులుతుందా? వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన సైనికులు.. అనంతరం స్థానిక పోలీసులకు అప్పగించారు. అయితే ముందుగా వీరిని గూఢచారులగా భావించిన పోలీసులు విచారణ అనంతరం ఇది ప్రేమ వ్యవహారంగా తేల్చేశారు. వీరి వ్యవహారంపై పూర్తిగా విచారణ చేపట్టిన సుర్సంద్ జిల్లా ఎస్పీ హర్కిషోర్ రాయ్ వివరాలను మీడియాకు వివరించారు. బీహార్ పోలీసుల నుంచి సమాచారం అందుకున్న హైదరాబాద్ పోలీసులు అహ్మద్ కార్యకలాపాలు గురించి, ఖలీజా పేరుతో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించిన వారి గురించి ఆరా తీస్తున్నారు. మొత్తానికి వీరి ప్రేమ వ్యవహారంపై బీహార్,హైదరాబాద్ పోలీసులతో పాటు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా దృష్టి సారించాయి.సినిమా కథను తలపించే ఈ రియల్ లవ్ స్టోరీ ఇప్పుడు దాయాది దేశాల మధ్య హాట్‌టాపిక్‌గా మారింది.