Pawan Kalyan : జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన దూకుడును పెంచారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో వ్యూహాలను రచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూనే రాజకీయ ప్రత్యర్థులను తనదైన శైలిలో ఎదుర్కొంటున్నారు పవన్ కళ్యాణ్. వివిధ కార్యక్రమాల ద్వారా సభల ద్వారా ప్రజలతో టచ్‌లో ఉంటున్నారు జనసేనాని. ఇక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రజల్లోకి మరింతగా వెళ్లాలని నిశ్చయించుకున్న పవర్ స్టార్ తన ప్రచార రథానికి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇప్పటికే పవన్ కొండగట్టుకు బయల్దేరారు. 11 గంటలకు కొండగట్టు చేరుకుంటారు. ఈ క్రమంలో పవన్ టూర్‌కి సంబంధించిన మ్యాప్‌ను పార్టీ శ్రేణులు విడుదల చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఉదయం 11 గంటలకు కొండగట్టుకు చేరుకుంటారు పవన్. ముందుగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం తన ప్రచార రథం వారాహికి అక్కడి అర్చకుల ద్వారా వాహన పూజ చేయిస్తారు. అక్కడ కాసేపు సమయాన్ని గడిపిన అనంతరం పవన్ 2 గంటలకు కొడిమ్యాలలోని ఓ రిసార్ట్‌కు చేరుకుంటారు. ఆ రిసార్ట్‌లోనే తెలంగాణకు చెందిన పార్టీ నేతలతో రాష్ట్రంలో పార్టి పరిస్థితులపై ముఖ్య నేతలతో చర్చిస్తారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ నేతలు ఏం చేయాలి అనేదానిపై పవన్ దిశానిర్శేశం చేస్తారు. ఈ సమావేశం ముగియగానే జనసేన అధినేత ధర్మపురి లక్ష్మీనరసింహ క్షేత్రానికి చేరుకుంటారు. అక్కడ నుంచే తన నరసింహ యాత్రను ప్రారంభించనున్నారు పవన్ కళ్యాణ్. ఈ యాత్రలో భాగంగా పవన్ 31 నారసింహును పుణ్యక్షేత్రాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగుప్రయాణం కానున్నారు. పవన్ కొండ గట్టు పర్యటన నేపథ్యంలో భారీ బంధోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు.
నిజానికి పవన్ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించి చాలా రోజులు అవుతోంది. ఈ క్రమంలో వారాహి ద్వారా పవన్ ప్రచారం చేపట్టనున్నారు అన్న విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్తేజం మొదలైంది. పవన్ రాక కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక తెలంగాణలో ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకున్నా కూడా పవన్ కొండగట్టును సందర్శిస్తుంటారు. అదే సెంటిమెంట్‌తో ఇప్పుడు కొండగట్టు అంజన్నను పవన్ దర్శించుకుంటున్నారని అభిమానులు చెబుతున్నారు. ఇక తాను ఎంతో ఇష్టపడి తయారు చేయించుకున్న ప్రత్యేక వాహనం కూడా సిద్ధం కావడంతో తన ప్రచారంలో జోరు పెంచనున్నారు.