Pawan Kalyan: సినిమాలలో స్టార్ హీరోగా ఉండి రాజకీయాలలోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. అయితే సక్సెస్ అయిన వారిలో మాత్రం ఎన్టీఅర్, ఎంజీఆర్ మాత్రమే కనిపిస్తారు. వారు తమని తాము నాయకులుగా ప్రజలకి భరోసా కల్పించగలిగారు. అందుకే ప్రజలు కూడా వారికి పట్టం కట్టారు. ఆ తరువాత అంతే ప్రజాదారణ ఉన్న మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్నికలలో పోటీ చేశారు. కేవలం 18 స్థానాలకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత పార్టీని నడపలేక కాంగ్రెస్ లో విలీనం చేసి రాజ్యసభ కోటాలో ఎంపీ అయ్యి కేంద్ర మంత్రి కూడా అయిపోయారు. ఇక రాజకీయాలు తనకి సెట్ కావని పక్కకి తప్పుకున్నారు. అయితే తన అన్న సాధించలేనిది నేను సాధిస్తా అంటూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ చరిష్మా ఉన్న వ్యక్తి కావడంతో ఎన్నికలలో 2014లో పోటీ చేస్తే ఎన్నో కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉండేది.
అయితే ప్రజారాజ్యం క్లోజ్ అవ్వడానికి కారణం అయిన చంద్రబాబుకి మద్దతు ఇచ్చి మెగా అభిమానులకి షాక్ ఇచ్చారు. అయితే కొంత పవర్ మానియా కారణంగా అప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అయితే 2019 ఎన్నికలలో మరల వైసీపీకి ప్రజా తీర్పు అనుకూలంగా ఉంటుందని ముందుగానే గ్రహించిన బాబు అండ్ కొ పవన్ కళ్యాణ్ ని బయటకి పంపించి పోటీ చేయించారు. ఒంటరి పోరుతో వ్యతిరేక ఓటు చీల్చి మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చంద్రబాబుకి పూర్తి సహాయ సహకారాలు అందించారని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. అన్ని చోట్ల కొత్తవాళ్ళు బలహీనమైన అభ్యర్ధులని ఏదో పేరుకె నిలబెట్టారు. బలమైన అభ్యర్ధులని బరిలో దించడానికి ఛాన్స్ ఉన్నా అలా చేయలేదు.
అయితే పవన్ కళ్యాణ్, చంద్రబాబు కుట్రలని జగన్ మోహన్ రెడ్డి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో వైసీపీకి ప్రజలు పట్టం కట్టారు. చివరికి పవన్ కళ్యాణ్ ని పోటీ చేసిన రెండు చోట్ల ఓడించారు. అయితే పార్టీ పరువు పోవడంతో రాజకీయ ఉనికి కోసం పవన్ కళ్యాణ్ బీజేపీతో జత కట్టి ఇన్నేళ్ళు కొనసాగుతూ వచ్చారు. అయితే ఎన్నికల ముందు మరల చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడం కోసం తన స్టాండ్ మార్చుకొని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటం కోసం పొత్తులు అంటూ కొత్త పల్లవిని పవన్ అందుకున్నారు. ఇలా రాజకీయాలలోకి వచ్చి సొంత అజెండాతో నాయకుడిగా నిలబడే ప్రయత్నం చేయకుండా కేవలం చంద్రబాబు కోసమే పని చేస్తూ పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా జీరోగా మిగిలిపోయారు అనేది రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. ఇదే పంథాలో వెళ్తే ఎప్పటికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాలేడు అనేది చాలా మంది చెప్పే మాట.