PM Modi : టర్కీలో భూకంప బాధిత ప్రజలకు అన్ని విధాలా సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ 2023 కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, టర్కీని తాకిన విధ్వంసకర భూకంపాన్ని మనమందరం చూస్తున్నాము, అనేక మంది ప్రజలు మరణించడంతో పాటు నష్టం జరిగినట్లు నివేదికలు ఉన్నాయి, టర్కీకి సమీపంలోని దేశాలలో కూడా నష్టం సంభవించినట్లు అనుమానిస్తున్నారు. భూకంప బాధిత ప్రజలకు అన్ని విధాలా సహాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. అదే విధంగా ఇండియా ఎనర్జీ వీక్ 2023 కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ అభివృద్ధి చేసిన సోలార్ కుకింగ్ సిస్టమ్ , ట్విన్-కుక్‌టాప్ మోడల్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు.
ఘోరమైన భూకంపం తరువాత టర్కీలోని ఏడు ప్రావిన్సులలో కనీసం 76 మంది మరణించారు, సిరియాలో 42 మంది మరణించినట్లు ప్రాథమిక నివేదికలో అధికారులు వెల్లడించారు. భూకంపం సంభవించిన ప్రాంతాలకు తక్షణమే సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలను పంపించామని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ట్విట్టర్‌లో తెలిపారు. సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు.
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ట్వీట్ వేదికగా , టర్కీ, సిరియా లను కుదిపేసిన విషాద భూకంపంలో ప్రాణనష్టం గురించి విచారం వ్యక్తం చేశారు. యుఎస్ జాతీయ భద్రతా సలహాదారు కూడా ట్విట్టర్‌లో భూకంప బాధిత దేశం త్వరగా కోలుకోవడానికి టర్కీకి సకాలంలో సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. టర్కీ, సిరియాలో సంభవించిన విధ్వంసకర భూకంపం పట్ల అమెరికా తీవ్ర ఆందోళన చేస్తోంది. అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలిపింది.