Pm Modi : ఇవాళ్టి బడ్జెట్ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటుకు హాజరయ్యారు. అదేంటి ఎప్పుడూ హాజరయ్యేదే కదా ఇందులో కొత్తేముంది అనుకునేరు. అయితే, ఆయన రాజ్యసభలో కనిపించడం స్పెషల్ కాదు, ఆయన వేసుకున్న చొక్కా ప్రస్తుతం అందరిని అట్రాక్ట్ చేస్తోంది.

పార్లమెంట్‌కు ప్రధాని స్కై-బ్లూ సద్రి జాకెట్ వేసుకువచ్చారు. ఇందులోనే ప్రత్యేకత అందా దాగివుంది. రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ బాటిళ్లతో ఈ వస్త్రాన్ని తయారు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి 6న బెంగళూరులో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మోదీజీకి ఈ జాకెట్‌ను బహుకరించింది.

ఈ జాకెట్ ను ఇప్పుడు మోదీ వేసుకుని పార్లమెంట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారారు. మోదీ ఈ జాకెట్‌కు సంబంధించిన పిక్ ను పోస్ట్ చేసి కేంద్ర గృహనిర్మాణం , పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్విట్టర్లో ప్రధానిని ప్రశంసించారు. ప్రస్తుతం మోదీ ధరించిన ఈ రీసైకిల్డ్ జాకెట్ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. మోదీని ప్రశంసలతో నెటిజన్లు ముంచేస్తున్నారు.

మోదీ వేసుకున్న ఈ జాకెట్ ను ఇండియన్ ఆయిల్ వారు తయారు చేశారు. పాడేసిన బాటిళ్లను సేకరించి వాటిని కడిగి , ఆరబెట్టి, చిన్న చిప్స్‌గా చూర్ణం చేసి, ఆచిప్లను వేడి చేసి, స్పిన్నరెట్ గుండా పంపి పాలిస్టర్ ప్రధానమైన ఫైబర్‌ను రూపొందించి, ఇది క్రింపింగ్ మెషీన్లో మెత్తటి, ఉన్ని ఆకృతిని తీసుకువచ్చిన తరువాత పాలిస్టర్ ప్రధానమైన ఫైబర్ నూలును ఉత్పత్తి చేసి దాని నుంచి ఈ జాకెట్‌ను తయారు చేసినట్లు ఇండియన్ ఆయిల్ సంస్థ తెలిపింది. బట్టలు , బూట్లను కూడా ప్లాస్టిక్‌ను రీసైకిల్ తో చేసే ఇతర కంపెనీలు ఇదే ప్రక్రియను ఫాలో అవుతాయని తెలుస్తోంది. ఈ ప్లాస్టిక్ ఫైబర్ థ్రెడ్స్ నుంచి వివిధ రకాల వస్త్రాలను తయారు చేయవచ్చు. స్విమ్మింగ్ సూట్స్ నుంచి షర్ట్స్ వరకు అన్నింటిని డిజైన్ చేయవచ్చు. ఉంటాయి. ఒక టీ షర్ట్‌ను తయారు చేయడానికి దాదాపు ఆరు రీసైకిల్ బాటిళ్లు, బాడీసూట్ చేయడానికి ఆరు సీసాలు, స్లీప్‌సూట్ చేయడానికి తొమ్మిది సీసాలు అవసరమవుతాయి.
ఫ్యాషన్ రంగంలో రీసైకిల్ ప్లాస్టిక్ దుస్తులు చాలా కాలంగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద బ్రాండ్లు , సెలబ్రిటీలు రీసైకిల్డ్ ప్లాస్టిక్ తో చేసిన వస్త్రాలను ధరిస్తున్నారు. స్పోర్ట్స్ దిగ్గజం అడిడాస్, పూర్తిగా రీసైకిల్ చేసిన ఓషన్ ప్లాస్టిక్‌తో తయారు చేసిన షూలను రూపొందిస్తోంది. 2024 నాటికి అన్ని వర్జిన్ పాలిస్టర్లను రీసైకిల్ చేసిన పాలిస్టర్‌తో భర్తీ చేయడమే తమ లక్ష్యమని ఈ స్పోర్ట్స్‌వేర్ కంపెనీ తెలిపింది. అదే విధంగా నైక్ తన ఉత్పత్తులలో 60 శాతంలో రీసైకిల్ మెటీరియల్ ఉపయోగిస్తుందని తెలిసింది. ప్రాడా, గూచీ , స్టెల్లా మాక్కార్ట్నీ వంటి ఉన్నత ఫ్యాషన్ డిజైనర్లు తమ దుస్తులలో రీసైకిల్ ప్లాస్టిక్‌ను చేర్చారు.