సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ప్రస్తుతం సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కలయికలో రాబోతున్న మూడో సినిమా ఇది అనే విషయం అందరికి తెలిసిందే. మహేష్ తో చేసిన అతడు సినిమా త్రివిక్రమ్ ని మాటల మాంత్రికుడుగా ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ లో ఉన్న హ్యూమర్ ని మొదటి సారి ఖలేజా సినిమాతో టాలీవుడ్ కి పరిచయం చేసిన ఘనత కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ కి దక్కుతుంది. ఆ సినిమా తర్వాత మహేష్ తో ఇతర దర్శకులు కామెడీ చేయించి హిట్స్ కొట్టారు. ఇప్పుడు మూడో సినిమాగా వస్తున్న దీనిపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథల నుంచి బయటకి వచ్చి మొదటి సారి ఈ సినిమా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. అలాగే మహేష్ ని సరికొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం కూడా చేయబోతున్నారు.
ఈ మూవీ త్రివిక్రమ్, మహేష్ కలయికలో వచ్చిన అతడుకి ప్రీక్వెల్ అనే టాక్ కూడా వినిపిస్తుంది. అయితే అసలు కథ ఎలా ఉండబోతుంది అనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా ఇప్పటికే పూజా హెగ్డేని త్రివిక్రమ్ ఖరారు చేశారు. ఇక రెండో హీరోయిన్ గా చాలా మంది పేర్లు పరిశీలిస్తున్నారు. పెళ్ళిసందడి ఫేం శ్రీలీలని ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఫైనల్ చేసినట్లు టాక్ వస్తుంది. అయితే అది సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం కాదనే మాట బలంగా వినిపిస్తుంది. ఇప్పుడు ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఖరారైనట్లు చర్చ నడుస్తుంది. గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మలయాళీ ముద్దుగుమ్మ ప్రియాంకా అరుల్ మోహన్ ని ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఫైనల్ చేసారని వినిపిస్తున్న మాట.
అయితే గత సినిమాలలో త్రివిక్రమ్ సెకండ్ హీరోయిన్ కి అంత ప్రాధాన్యత లేని పాత్రలే ఇస్తూ వచ్చారు. ఈ సినిమాలో మాత్రం సెకండ్ హీరోయిన్ పాత్ర చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుందనే మాట వినిపిస్తుంది. ఈ కారణంగానే చాలా రోజులు వేచి చూసి ప్రియాంకాని ఖరారు చేసినట్లు బోగట్టా. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.