Raipur : ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో వివాహ రిసెప్షన్‌కు కొద్దిసేపటి ముందే కొత్తగా పెళ్లయిన దంపతులు తమ ఇంట్లోని ఓ గదిలో కత్తిపోట్లతో విగత జీవులుగా కనిపించారు. క్రైమ్ సీన్ ద్వారా ఇద్దరి మధ్య గొడవ జరిగి భార్యను కత్తితో పొడిచి హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిద్దరూ కొంతకాలం ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో తిక్రాపారా పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రిజ్‌నగర్‌లో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుందని పోలీస్ అధికారి తెలిపారు. 24 ఏళ్ళ అస్లామ్ , 22 ఏళ్ళ కహ్కషా బానో లు పెద్దల సమక్షంలో ఆదివారం వైభవంగా వివాహం చేసుకున్నారు . వారి వివాహ రిసెప్షన్ మంగళవారం రాత్రి జరగాల్సి ఉంది. వారు తమ గదిలో ఫంక్షన్‌కు సిద్ధమవుతుండగా, వరుడి తల్లి వధువు అరుపులు విని అక్కడికి చేరుకుంది. గది లోపలి నుండి తాళం వేసి ఉండటం వారు స్పందించకపోవడంతో, కుటుంబ సభ్యులు కిటికీలోంచి చూడగా, రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో దంపతులు పడి ఉండటం చూశారు. వెంటనే వధువు, వరుడు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి, కత్తిపోట్లతో ఉన్న వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపించారు. సంఘటన స్థలం నుండి కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగి భార్యపై కత్తితో దాడి చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ విషయంపై విచారణ జరుగుతోందని ఆయన తెలిపారు.