అక్కాచెల్లెళ్లు ఎంతగానో ఎదురుచూసే రాఖీ పర్వదినాన్ని ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ రోజు సోదరీమణులంతా ఎక్కడ ఉన్నా వచ్చి సోదరుల ముందు వాలిపోతుంటారు. అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెల్ల మధ్య ఉన్న ప్రేమానురాగాలకు ప్రతీక ఈ రాఖీ పండగ. ఒకరికొకరు అండగా ఉంటామని భరోసా ఇచ్చే ఈ రాఖీ వేడుకల్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. రాఖీ వేళ అన్నా చెల్లికి సంబంధించిన ఓ నాటిక ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇపుడు ఆ వీడియోపై ఓ లుక్కేద్దామా..
వంట చేస్తున్న భార్య దగ్గరకు వచ్చి ‘రాజీ రేపు మా చెల్లి వస్తుంది. ఇంట్లోకేం కావాలో చెప్తే తీసుకువస్తా’నని అంటాడు భర్త. పెళ్లైనప్పటి నుంచి నాకేం కావాలో అడగలేదు కానీ చెల్లి వస్తానంటే ఆస్తులు కరగతీస్తాడు.. అని మనసులో గుణుక్కుంటుంది రాజీ. ఏం మాట్లాడవేంటి అని భర్త అనగా.. రేపు మా అన్నయ్య వస్తున్నాడు కావల్సిన లిస్టు రాశాను తీసుకురండి అంటుంది భార్య. ఎలాగైనా అన్నా చెళ్లెల్లను కలవనీయకూడదు అనుకుంటుంది మనసులో. ఉదయమే నిద్రలో ఉన్న అన్నకు తన చెల్లితో చిన్నపుడు ఆడుకున్న ఆటలు గుర్తుకువస్తాయి. భార్యను లేపి మా చెల్లి వస్తది రెడీ అవమంటాడు. ఆ తర్వాత బెల్ శబ్దం వినపడగానే.. తన చెల్లేమో అనుకుని ఆతృతగా వెళ్లి తలపులు తీస్తాడు అన్న. కానీ పాలవాడు వస్తాడు.
ఆ తర్వాత కొద్ది సేపటికి చెల్లి వస్తుంది. కానీ అన్నయ్య ఇంట్లో ఉండడు. వదిన వెళ్లి డోర్ తీస్తుంది. వచ్చావమ్మా.. వచ్చావా.. అంటూ తనతో దురుసుగా ప్రవర్తిస్తుంది. మీ అన్నయ్య ఏమైనా కోట్లు కూడబెట్టాడా.. దోచుకుపోవడానికి వచ్చావా అంటూ తనమీద అరుస్తుంది. కట్నకానుకల కోసం రాలేదు వదిన. అన్నయ్యకు ప్రేమగా రాఖీ కట్టడానికి వచ్చానంటుంది ఆడపడుచు. అయినప్పటికీ వదిన లోపలికి రమ్మనకపోవడంతో బాధగా వెళ్లిపోతుంది. చిన్నపుడు తన అన్నయ్యకి రాఖీ కట్టిన రోజులను, ప్రతి సంవత్సరం తను ఎక్కడ ఉన్నా వచ్చి రాఖీ కడతానని అన్నయ్యకు ఇచ్చిన మాటను గుర్తుచేసుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది.
ఆ తర్వాత ఏంటీ మా చెల్లి ఇంకా రాలేదు అంటాడు భర్త భార్యతో. అంతలోనే రాజీ అన్నయ్య వస్తాడు. మీ అన్నయ్య వచ్చాడు కానీ మా చెల్లి రావట్లేదేంటి అంటాడు మళ్లీ. అన్నయ్యకు ప్రేమగా రాఖీ కట్టి ఆశీర్వదించమని అడుగుతుంది రాజీ. అపుడు ఆమెతో నేను రావడం నీకు ఇష్టమేనా అంటాడు అన్నయ్య. అదేంటి అలా అంటున్నావ్ అని అడగ్గా.. నీ ఆడపడుచుపై అలా దురుసుగా ప్రవర్తించడం తప్పమ్మా. ఎందుకమ్మా ఆ అన్నాచెల్లల్లను విడదీశావ్ అని నిలదీస్తాడు రాజీని. భార్యని తిట్టి తన చెల్లిని వెతుక్కుంటూ రోడ్డుపైకి పరుగెత్తుకుంటూ వెళ్తాడు అన్నయ్య. అక్కడే ఓ పక్కన కూర్చున్న చెల్లిని తిరిగి ఇంటికి తీసుకువెళ్తాడు. ఆ చెల్లి సంతోషంగా అన్న వెంట వెళ్తుంది.