కరోనా ఎఫెక్ట్‌తో చాలా సినిమాలు వాయిదా పడుతూ వచ్చాయి. మరోవైపు థియేటర్స్ మూతపడటంతో ఓటీటీ వేదికలు ప్రేక్షకులకు సినిమాలను దగ్గరచేసాయి. క్రమంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ డిమాండ్ పెరుగుతుంది. ఇప్పటికే కొన్ని మీడియం రేంజ్ సినిమాలను ఓటీటీ వేదికలపై రిలీజ్ చేసి సక్సెస్ సాధిస్తున్నారు మేకర్స్. ఈ బాటలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా వెళ్లబోతోందట. ఈ మూవీ రిలీజ్ విషయంలో కొన్ని అడ్డంకులు వస్తుండటంతో చివరకు రవితేజ టీమ్ ఫైనల్ డిసీజన్‌కి వచ్చారని తెలుస్తోంది.
ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా మార్చి 25న విడుదల కావాల్సి ఉంది. కానీ అదే డేట్ RRR సినిమా లాక్ చేసుకోవడంతో మేకర్స్ వెనక్కి తగ్గారు. ఆ తర్వాత ఏప్రీల్ 15న ఈ సినిమా ను విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంటే.. అప్పుడు కూడా పెద్ద సినిమాలు అడ్డు పడుతూవస్తున్నాయి. కేజియఫ్ 2తో పాటు విజయ్ బీస్ట్ సినిమాలు రెండు ఏప్రీల్ 14న విడుదల కాబోతున్నాయి. దీంతో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని ఫిక్సయిపోయారు మేకర్స్.
విడుదలకు నోచుకోని పెద్ద చిత్రాలు క్రమంగా థియేటర్స్ లోకి వస్తుండటంతో చిన్న, మీడియా బడ్జెట్ సినిమాలు వెనక్కి తగ్గాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పలు ఓటీటీ సంస్థలు డిమాండ్ ఉన్న ఆ సినిమాలకు భారీ ఆఫర్స్ చేస్తున్నాయి. ఇలా ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాకు కూడా సోనీ లైవ్ మంచి ఆఫర్ ఇవ్వడంతో ఆ దిశగా మేకర్స్ ఆలోచనలు చేస్తున్నారని సమాచారం. జూన్ వరకు సరైన డేట్స్ లేకపోవడంతో ఓటీటీ దిశగా అడుగులేస్తున్నారని తెలుస్తోంది.
కొత్త దర్శకుడు శరత్ మందవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈమూవీ ను ఎల్ఎల్‌పి బ్యానర్‌పై సుధాకర్ చేకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించబోతున్నారు.