టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనవరి 27 నుంచి పాదయాత్ర చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. యువ గళం పేరుతో జరగబోయే ఈ పాదయాత్రను కుప్పం నుంచి నారా లోకేష్ మొదలుపెట్టబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో నారా లోకేష్ ఈ యువ గళం పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ పాదయాత్రను అడ్డుకోవడానికి వైసిపి ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన కూడా పాదయాత్ర బలంగా చేయాలని నారా లోకేష్ నిశ్చయించుకున్నారు.
ఇదిలా ఉంటే ఈ పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ ను తాజాగా విడుదల చేశారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం నాలుగు వేల కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర జరగనుంది. ప్రతి ఉమ్మడి జిల్లాలో నెలరోజుల పాటు పాదయాత్ర నిర్వహించడానికి షెడ్యూల్ వేశారు. చిత్తూరు నుంచి అనంతపురం, కర్నూల్, కడప, నెల్లూరు, ఒంగోలు మీదుగా కోస్తా జిల్లాల్లోకి యాత్ర కొనసాగుతుంది. 26వ తేదీన తిరుపతిలో శ్రీవారి దర్శనం చేసుకుని 27న కుప్పంలో వరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.
అనంతరం పాదయాత్రను మొదలుపెడతారు. అయితే ఈ పాదయాత్రని నారా లోకేష్ 175 నియోజకవర్గాల్లో కాకుండా 123 నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం చేసినట్లు రూట్ మ్యాప్ బట్టి తెలుస్తుంది. అయితే పాదయాత్రకు టిడిపి ఇప్పటికే ప్రభుత్వానికి, పోలీసులకు లేఖలు రాసిన కూడా ఎలాంటి స్పందన ఇంకా రాలేదు. తన పాదయాత్రను అడ్డుకునే క్రమంలోనే ప్రభుత్వం ఇలా వేచి చూసే ధోరణి అవలంబిస్తుందని మాట వినిపిస్తుంది.
అయితే గతంలో వైయస్ జగన్ పాదయాత్ర చేసే సమయంలో తన యాత్రకి ప్రభుత్వ అనుమతి అవసరం లేదని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని తెలుగుదేశం పార్టీ ముందు పెట్టి ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాలు వినిపిస్తున్న మాట. మరి దీనిపై వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి.