RRR : ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎంతటి సెన్సేషన్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు ఈ పేరులోనే ఓ మ్యాజిక్ ఉంది. ఈ సినిమా తర్వాత రాజకీయాల్లోనూ ‘ఆర్ఆర్ఆర్’ హైలైట్ అవుతోంది. ఏపీలో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజును ‘ఆర్ఆర్ఆర్’ అని పిలుస్తారు. ఇక తెలంగాణలో అయితే బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, రాజాసింగ్‌లను ‘ఆర్ఆర్ఆర్’ అని పిలుస్తుంటారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సమయంలో తెలంగాణ బీజేపీ ‘ఆర్ఆర్ఆర్’ అనే పదాన్ని బాగా ఉపయోగించింది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల సన్పెన్షన్. ఈ ముగ్గురూ న్యాయం కోసం హైకోర్టు మెట్లెక్కడం వంటి అంశాలతో ఇది బాగా హైలైట్ అయిపోయింది.
RRR : రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి..
ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ మరోసారి హైలైట్ అవుతోంది. అది టీ కాంగ్రెస్ ద్వారా. టీకాంగ్రెస్‌లో కూడా ‘ఆర్ఆర్ఆర్’ ఉన్నారు. వారే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి. ఈ ముగ్గురు రెడ్డిలను కలిపి ‘ఆర్ఆర్ఆర్’ అని సంబోదిస్తున్నారు. ఈ ముగ్గురి పిక్స్ ‘ఆర్ఆర్ఆర్’ పోస్టర్‌తో సోషల్ మీడియాను ఏలేస్తున్నాయి. రాష్ట్రంలో వరదల విషయమై టి-కాంగ్రెస్ ఎంపీలు సభలో గళం విప్పడంతో ఆ పార్టీ ఈ కోణంలో ‘ఆర్ఆర్ఆర్’ ఉపయోగించి ఉండవచ్చునని రాజకీయ నేతలు భావిస్తున్నారు. గతంలో రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి మధ్య విభేదాలు బాగానే నడిచాయి. కానీ ఈ మధ్య కలిసిపోయి ఒకే వేదికపై కనిపిస్తుండటం కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌లో జోష్‌ను నింపుతోంది. ఇక వీరిద్దరికీ ఉత్తమ్ కూడా తోడవడంతో కాంగ్రెస్‌కు తిరుగులేదనే భావన కలుగుతోంది.
టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన నాటి నుంచి నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్ అంటేనే అంతర్యుద్ధం గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. అంతా ఒక్కటిగా కనిపిస్తున్నారు. తమ పార్టీ కార్యకర్తల్లో మంచి జోష్ నింపుతున్నారు. పార్టీలో చేరికలకు ప్రాధాన్యమిస్తున్నారు. చాప కింద నీరులా తమ పార్టీని విస్తరిస్తున్నారు. సర్వేలు సైతం కాంగ్రెస్ పార్టీని రెండో స్థానంలో నిలబెట్టాయి. ఇక కాస్త కృషి చేస్తే.. టీఆర్ఎస్ పార్టీకున్న ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకోగలిగితే మాత్రం ఆ పార్టీకి తిరుగుండదనే చెప్పాలి. మరి రేవంత్ సారధ్యంలో ఈ ఏపార్టీ ఏమేరకు విజయం సాధిస్తుందో చూడాలి.