సినిమాను ప్రేమించే ప్రతీ భారతీయుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా RRR. బాహుబలితో తెలుగు సినిమా రేంజ్ ఏంటో ప్రపంచానికి చాటిన దర్శకుడు. ఆయన దర్శకత్వంలో వస్తున్న తదుపరి చిత్రం కావడం ఒకటైతే.. టాలీవుడ్ అగ్ర హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరో లు గా నటిస్తున్నారు. మార్చి 25న సినిమా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు మరో ఐదారు అనువాద భాషల్లోనూ ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుంది.
RRR విడుదలకు ముందే సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందోనని అందరిలోనూ ఉంది. సినిమాను భారీ రేంజ్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు రాజమౌళి అండ్ టీమ్. ఇటు ఇండియా.. అటు విదేశాల్లోనూ ఎవరూ ఊహించనన్ని థియేటర్స్‌లో RRR రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకోబోతుంది. ఏంటంటే లండన్‌లో అతి పెద్ద స్క్రీన్ అయిన బీఎఫ్ఐ ఐమ్యాక్స్‌లో ఈ సినిమాను ప్రదర్శించబోతున్నారు. ఈ తెరపై ప్రదర్శితం కానున్న తొలి తెలుగు చిత్రం ఇదే అవ్వనుంది. యు.కెలో 1000 స్క్రీన్స్‌కు పైగా RRR రిలీజ్ కానుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ట్రిపుల్ ఆర్ రిలీజ్‌కు ముందు రిలీజ్ తర్వాత మరెన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి. ఫ్యాన్స్, సినీ గోయర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
1920 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఫిక్షనల్ పీరియాడిక్ సినిమా RRR. ఇందులో గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటించారు. ఇక కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్.. హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి చేస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ కలుసుకోని ఇద్దరు యోధులు కలుసుకుని బ్రిటీష్ వారిని స్వాతంత్య్రం కోసం ఎదిరిస్తే ఎలా ఉంటుందనే ఫిక్షనల్ పాయింట్‌తో మూవీ ను జక్కన్న తెరకెక్కించారు.