రాజమౌళి సృష్టించిన అద్బుత సృష్టి ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయ చిత్రోత్సవాలలో వరుసగా మెరుస్తూ వస్తుంది. ఆస్కార్ బరిలో పోటీ పడుతున్న ఈ సినిమా దానిని అందుకునే దిశగా వాడిగా అడుగులు వేసుకుంటూ వెళ్తుంది. ఇండియన్ సినిమాకి అరుదైన గౌరవం ఆర్ఆర్ఆర్ సినిమాతో వస్తుందని చెప్పాలి ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ ఆర్ఆర్ఆర్ సినిమాని కమర్షియల్ సినిమా జోనర్ లో చూసి కనీసం ఆస్కార్ అవార్డుల నామినేషన్ కి కూడా ఇండియా నుంచి ఎంపిక చేయకుండా అవమానించింది. అయితే ఇండిపెండెంట్ కేటగిరీలో అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ఆర్ఆర్ఆర్ సినిమా ఖ్యాతిని జక్కన్న ఇనుమడింపచేస్తున్నారు. ఇప్పటికే న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్ అవార్డులని అందుకున్న ఆర్ఆర్ఆర్ ఆస్కార్ తర్వాత మరో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలో మెరిసింది.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ మూవీలో నాటు నాటు సాంగ్ కి అవార్డు వరించింది. ఇండియా నుంచి ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆసియా నుంచి గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలో బెస్ట్ ఒరిజినల్ కేటగిరీలో ఓ సాంగ్ అవార్డు అందుకోవడం ఇదే ప్రథమం అని చెప్పాలి. రెడ్ కార్పెట్ పై హాలీవుడ్ ప్రముఖుల మధ్య వెళ్లి గోల్డెన్ గ్లోబ్ అవార్డుని ఎంఎం కీరవాణి అందుకున్నారు. ఇక ఈ సాంగ్ కి ప్రపంచం మొత్తం డాన్స్ చేసిందని చెప్పాలి. నాటు నాటు సాంగ్ లో లెరిక్స్ తెలియకున్నా కూడా అమెరికన్ థియేటర్స్ లో ఫారినర్స్ కూడా నాటు నాటు పాటకి స్టెప్పులు వేయడం విశేషం. ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో రామ్ చరణ్, తారక్ హాలీవుడ్ మీడియా దృష్టిలో పడటమే కాకుండా హాలీవుడ్ దర్శక, నిర్మాతలని కూడా ఆకర్షించారు.
ఇండియన్ కమర్షియల్ కి ఉండే స్టామినా ఏంటో అనేది వారు ప్రత్యక్షంగా చూసారు. ఇదిలా ఉంటే గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకోవడంపై ఇండియా మొత్తం కదిలింది ప్రధాని మోడీ చిత్ర యూనిట్ ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. అలాగే బాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రికెట్ సెలబ్రిటీలు అందరూ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకోవడంపై అభినందనలు తెలియజేస్తూ ప్రశంసలు కురిపించారు. ఇలా అభినందించిన వారిలో ప్రియాంకా చోప్రా కూడా ఉండటం విశేషం. అలాగే నాటునాటు పాటకి గోల్డెన్ గ్లోబ్ వరించడంపై హాలీవుడ్ ప్రముఖులు సైతం చిత్ర యూనిట్ ని అభినందనలు తెలియజేయడంతో పాటు 100 శాతం అర్హత ఉన్న సాంగ్ అని ప్రశంసించారు.