Sajjala: విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల సెంటిమెంట్ అని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని అన్నారు. ప్రజలందరూ జగనే మళ్లీ రావాలి, తమకు జగనే కావాలని కోరుకుంటున్నారని అన్నారు. స్టీల్ ప్లాంట్ టెండర్ లో చాలా పరిమితులు ఉన్నాయని, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ కోసం జగన్ నిర్మాణాత్మక ప్రతిపాదనలు చేశారని, ప్రధాని మోదీతోనూ చాలాసార్లు మాట్లాడారని సజ్జల పేర్కొన్నారు . పక్క రాష్ట్రాల్లో జరిగే పరిణామాలపై జగన్ ను నిలదీయాలని విపక్షాలు చూస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో తక్షణ ప్రయోజనం లేదా స్వార్థ ప్రయోజనం కోసం చంద్రబాబు ఆడుతున్న నాటకాలను గుర్తించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు సజ్జల పేర్కొన్నారు.
ఏ ప్రయత్నం చేసినా కేంద్రాన్ని ఒప్పించి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పోరాడితే పోయేదేం లేదనడానికి ఇదేమీ యూనియన్ కాదని, రాజకీయ పార్టీ అని వ్యాఖ్యానించారు. సమర్థంగా వాదించి కేంద్రాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని, రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు బీజేపీతో సహా స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రాన్ని అడగాలని సజ్జల కోరారు. చంద్రబాబు ఎంత ప్రమాదకరం అనే విషయాన్ని అందరికీ తెలిసేలా చేసేందుకు ప్రయత్నిస్తుంటామని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం పోరాటాల రూపాలు మారాయని, ఏది చేసినా సమతుల్యతతో చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ విషయంలో జగన్ చాలా స్పష్టమైన విజన్ తో ఉన్నారని అన్నారు. అందులో జగన్, రాజశేఖర్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయే నాయకులుగా ఉన్నారని సజ్జల పేర్కొన్నారు. రాజకీయ పరమైన ప్రయోజనాలు ఆశించి విపక్షాలు అనవసరమైన రాద్దాంతం చేస్తున్నాయని దయ్యబట్టారు. అధికార పార్టీగా తాము ఏం చేయాలో తాము అవన్నీ చేస్తామని సజ్జల పేర్కొన్నారు.