Special Status: అధికార పార్టీ వైసీపీ ఎన్నికలకి ముందు కేంద్రం మేడలు వచ్చి ప్రత్యేక హోదా సాధించి తీసుకొస్తామని చాలెంజ్ లు చేశారు. ప్రత్యేక హోదా అనేది ఏపీకి అమృతం లాంటిది అంటూ చెప్పుకొచ్చారు. స్పెషల్ స్టేటస్ లేకపోవడమే ఏపీ అభివృద్ధి చెందడం లేదు. కంపెనీలు రావడం లేదని ఊదరగొట్టారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ప్రత్యేక హోదా అనే అంశం పూర్తిగా పక్కకి వెళ్ళిపోయింది. ముఖ్యమంత్రి జగన్ కేంద్రంలో పెద్దలని కలవడానికి ఢిల్లీ వెళ్ళినపుడు, పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో కొద్ది రోజులు ప్రత్యేక హోదా అంటూ వైసీపీ నేతలు అందరూ హడావిడి చేస్తారు. ప్రత్యేక హోదాపై మోడీని అడిగిన జగన్ అంటూ ఊదరగొడతారు.

అలాగే పార్లమెంట్ లో ప్రత్యేక హోదాపై నిలదీసిన వైసీపీ ఎంపీలు అంటూ ప్రచారం విస్తృతంగా చేస్తారు. అయితే బీజేపీ పార్టీ మాత్రం ఇప్పటికే చాలా సార్లు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అని తేల్చేసింది. అయినా కూడా వైసీపీ మంత్రులు పదే పదే ప్రత్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యం అని అప్పుడప్పుడు ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రత్యేక హోదా ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్న నేపధ్యంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి క్లారిటీ ఇచ్చేసారు.
దేశంలోని ప్రత్యేక హోదాను ఏ రాష్ట్రానికి ఇవ్వడానికి హామీ ఇవ్వొద్దు అని ఆర్ధిక శాఖ తేల్చి చెప్పింది. అందుకే ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. ఏపీ రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా అంశాన్ని పరిగణలోకి తీసుకున్నప్పటికీ ఆర్ధిక శాఖ మాత్రం సాధ్యం కాదని సూచించడంతోనే వెనక్కి తగ్గినట్లు పేర్కొన్నారు. ఏపీ తోపాటు తెలంగాణ, బీహార్, ఒడిశా రాష్ట్రాలు కొన్నిరోజులుగా ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న అది సాధ్యపడే అంశం కాదని తేల్చి చెప్పేశారు.