సుడిగాలి సుధీర్.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కామెడీ షోలు చేస్తూనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు సుధీర్. తనకు వచ్చిన గుర్తింపు, ఆదరణతో సినిమాల్లోనూ లక్ పరీక్షించుకుంటున్నాడు. అనుకున్నట్లుగానే కొన్ని సినిమాలు చేసి వెండితెర ప్రేక్షకులను సైతం మెప్పిస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఈ బుల్లితెర స్టార్‌కు ఎంగేజ్మెంట్ జరిగిందంటూ ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. నిజంగానే ఓ కామెడీ షోలో సుధీర్‌కు ఎంగేజ్మెంట్ చేసారు. దీంతో అయోమయానికి లోనైన కొందరు అభిమానులు సుధీర్ త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నాడా..? లేదా…? అని చర్చలు మొదలు పెట్టారు.
గతంలో సుధీర్‌కు నిశ్చితార్ధమే కాదు? ఏకంగా పెళ్లి కూడా చేశారు. కాకపోతే అదంతా స్కిట్లో భాగంగానే జరిగింది కాబట్టి ..ఈ ఎంగేజ్మెంట్ కూడా కచ్చితంగా ప్రాంక్ అయ్యుంటుందని అభిప్రాయపడుతున్నారు చాలా మంది నెటిజన్లు. ఇలా చాలాసార్లు మోసపోయాం, కానీ ఈసారి ఆ ఛాన్స్ మీకు ఇవ్వమని తేల్చిచెప్పేస్తున్నారు. కానీ కొందరు మాత్రం.. ‘ఆ అమ్మాయి ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తిలా కనిపిస్తోంది కాబట్టి. ఒకవేళ నిజంగానే సుధీర్ తన ప్రియురాలిని పరిచయం చేసి ఉండొచ్చేమో!’ అంటున్నారు. మరి ఇదెంతవరకు నిజమో తెలియాల్సి ఉంది కదా!