గత 45 ఏళ్ళుగా సూపర్‌స్టార్ అనగానే రజనీకాంత్ గుర్తుకు వస్తారు. ఈ విషయం లో ఎలాంటి మార్పు లేదు అని సీనియర్ నటుడు సత్య రాజ్ స్పష్టం చేశారు. జొమోనో. ఫిలిప్ జినా జొమోనో సమర్పణలో ప్రైమ్రోజ్ ఎంటర్టైన్మెంట్, జులినా అండే జెరోమా ఫిల్మ్ కంపెనీలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘అంగాకగన్’ . ఇందులో హీరోగా శ్రీమతి నటించగా పోలీస్ అధికారి పాత్రలో విలనేగా సీనియర్ నటుడు సత్యరాజ్ నటించారు.
మలయాళ నటి నియా హీరోయిన్. హీరోగా నటించిన శ్రీపతి స్ర్కీన్‌ప్లే సమకూర్చడమే కాకుండా, క్రియేటివ్ డైరెక్టరుగా కూడా పనిచేశారు. ఇతర పాత్రలో మహేష్, రైనా కారత్, రోషన్, అప్పుకుట్టి, దియా నేహా రోజ్, గురుచంద్రన్, కేసీపీ ప్రసాద్ తదితరులు నటించారు. బాలీవుడు దర్శకుడు రాంగోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన మోహన్ డచ్చు దర్శకత్వం వహించారు. సెప్టెంబరు 8న ఈ సినిమా విడుదలకానుంది.
ఈ సందర్భంగా తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సత్యరాజ్ మాట్లాడుతూ… ‘‘గత 45 యేళ్లుగా సూపర్‌స్టార్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది రజనీకాంత్ ఒక్కరే. ఏళిసై మన్నర్, మక్కల్ తిలగం, నడిగర్ తిలగం వంటి ట్యాగ్లు కాలానికి అనుగుణంగా మారినప్పటికీ ఒక్కో ట్యాగ్ ఒక్కొక్కరికి సొంతం. రజనీకాంత్‌ను మక్కల్ తిలగం అంటే అంగీకరిస్తారా? ‘దశావతారం’ చిత్రంలో కమల్ హాసన్ అద్భుతంగా నటించారు. ఆయన్ను నడిగర్ తిలగం అని అనగలమా? అందువల్ల ‘సూపర్‌స్టార్’ అంటే రజనీకాంత్. ‘ఉలగనాయకన్’ అంటే కమల్ హాసన్.
‘దళపతి’ అంటే విజయ్. ‘తల’ అంటే అజిత్’’ అని అన్నారు. అయితే , సత్యరాజ్ ఇలా మాట్లాడటానికి కారణం లేకపోలేదు ..గత కొన్ని రోజులగా సూపర్‌స్టార్ ట్యాగ్‌పై రజనీకాంత్, విజయ్ అభిమానుల మధ్య తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. దీనికి ఫుల్‌స్టాఫ్ పెట్టేలా సత్యరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు.