కుటుంబసమేతంగా చూసి ఆస్వాదించగలిగే సినిమాలు ఈ మధ్యకాలంలో చాలా తక్కువగా వస్తున్నాయి. ఎక్కువగా యూత్ ని టార్గెట్ చేసుకొని సినిమాలని తెరకెక్కిస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చి చూడగలిగే సినిమాలు రావడం లేదు. అలాగే చూడగలిగే స్థాయిలో టికెట్ ధరలు కూడా ఉండటం లేదు. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లాలంటే కచ్చితంగా వెయ్యి నుంచి రెండు వేలు పెట్టుబడి పెట్టాల్సిందే. అయితే అప్పుడప్పుడు కుటుంబం అంతా కలిసి కూర్చొని హాయిగా నవ్వుకునే చిత్రాలు వస్తూ ఉంటాయి. అలాంటి జాబితాలోకి తాజాగా రిలీజ్ అయిన స్వాతిముత్యం సినిమా కూడా వస్తుందని చెప్పాలి. ప్యూర్ ఫామిలీ ఎంటర్టైనర్ గా, ఫన్ రైడ్ తో ఈ సినిమా ఉండబోతుంది అనే విషయాన్ని ట్రైలర్ ద్వారానే చిత్ర దర్శకుడు లక్ష్మణ్ కె చెప్పేసాడు. మరి సినిమా కథ ఎలా ఉందంటే
ప్రేమించిన అమ్మాయిని భాగ్యలక్ష్మిని పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అవుదామని అనుకున్న బాలమురళీకృష్ణకి అతి కష్టం మీద తల్లిదండ్రులని ఒప్పించి పెళ్లికి రెడీ అవుతాడు. ఇక ఇంట్లో అంతా పెళ్లి వాతావరణంలో సంతోషంగా ఉండగా శైలజ అనే పాత్ర ఎంట్రీ ఇస్తుంది. ఇక బాలమురళీకి పెళ్ళికి ముందే ఒక బిడ్డ ఉన్నాడనే షాకింగ్ విషయాన్నీ బయటపెడుతోంది. ఆ విషయం తెలిసిన తెలిసిన భాగ్యలక్ష్మి రియాక్షన్ ఏంటి? అసలు పెళ్ళికి ముందే బాలమురళీకి బిడ్డ ఎలా పుట్టాడు. పెళ్లికాకుండానే బిడ్డని కన్నాడన్న విషయం తెలిసిన తర్వాత బాలమురళీ తల్లిదండ్రులు స్పందన ఏమిటి? అలాగే అయినా బాలమురళీనే పెళ్లి చేసుకుంటానన్న భాగ్యలక్ష్మి తల్లిదండ్రుల రియాక్షన్ ఏంటి? ఇలా అన్ని ఇంటరెస్టింగ్ అంశాలతో కంప్లీట్ ఫ్యామిలీ మధ్యలో ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని జోడించి ఆధ్యాంతం ప్రేక్షకులని నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక అందులోనే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆసక్తికరంగా కంటతడి పెట్టించే విధంగా ఉంటాయి. ఒక చిన్న లైన్ ని తీసుకొని మధ్యతరగతి కుటుంబాలలోని వ్యక్తుల ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి. ప్రతి చిన్న విషయాన్ని బూతద్దంలో పెట్టి చూసేవారితో వచ్చే సమస్య ఏంటి అనే అంశాలని సున్నితంగా వినోదం ద్వారా దర్శకుడు చెప్పే ప్రయత్నం బాగుంది.
ఇక సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేష్ అమాయకత్వం, కన్ఫ్యూజన్ తో కూడిన పెర్ఫార్మెన్స్ తో బాగానే నటించి మెప్పించాడు. ఇక సినిమాని ఆధ్యంతం నడిపించింది మాత్రం హీరోయిన్ వర్షబొల్లమ్మ అని చెప్పాలి. ఆమె పాత్ర చాలా ఇంటరెస్టింగ్ గా ఉండటంతో కథని నడిపించే పాత్రలో ఓ వైపు ఫన్ తో ప్రేక్షకులని నవ్విస్తూనే మరో వైపు ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులని ఏడిపిస్తుంది. చిన్న చిత్రాలు చేస్తున్న కూడా వర్ష గుర్తుండిపోయే పాత్రలని ఆయా సినిమాలలో చేస్తూ మెప్పిస్తుంది. ఆమె లిస్ట్ లో మరో ఇంటరెస్టింగ్ మూవీగా ఈ సినిమా కూడా నిలుస్తుంది. ఇక మిగిలిన పాత్ర దారులు కూడా ఎవరి పరిధి మేరకు వారు బాగానే నవ్వించారు, ఏడిపించారు. సంగీతం కూడా కంటెంట్ కి తగ్గట్లుగానే క్లాసీగా సాగుతుంది. మొదటి సినిమాతోనే డీసెంట్ హిట్ ని బెల్లంకొండ గణేష్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే గాడ్ ఫాదర్, ఘోస్ట్ సినిమాలకి కూడా పాజిటివ్ టాక్ రావడంతో ఆ రెండింటి మధ్య ఈ సినిమా ఏ స్థాయిలో నిలబడి కలెక్షన్స్ సొంతం చేసుకుంటుంది అనేది చూడాలి.