టాలీవుడ్ లో మిల్కీ బ్యూటీగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి తమన్నా. మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన శ్రీ అనే మూవీ తో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన తమన్నాకి పెద్దగా కలిసి రాలేదు. తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హ్యాపీడేస్ మూవీలో అలరించి తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆమె కెరియర్ లో ఎక్కువగా గ్లామర్ పాత్రలకి పరిమితమైంది. తెలుగు దర్శకులు కూడా ఎక్కువగా తమన్నాను గ్లామర్ హీరోయిన్ గానే చూపించడానికి ఆసక్తి చూపించారు. అయితే 17 ఏళ్ల కెరియర్ లో ఎన్నో పాత్రలు చేసిన తమన్నా ప్రస్తుతం మాత్రం నటిగా తనను తాను ప్రూవ్ చేసుకునే రోల్స్ కోసం ఎదురుచూస్తుంది. ప్రస్తుతం తమన్న ని సీనియర్ హీరోలకు జోడిగా దర్శకులు ఎంపిక చేస్తున్నారు.
ఈమె నటించిన గుర్తుందా శీతాకాలం సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. మరోవైపు భోళాశంకర్ సినిమాలో చిరంజీవికి జోడిగా కనిపించబోతుంది. ఇక నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న జైలర్ మూవీలో కూడా తమన్నాని హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తన 17 ఏళ్లు కెరియర్లో ఎక్కువగా మహిళలను గ్లామర్ గా చూపించే సినిమాలు మాత్రమే చూసానని చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం సినిమాల విషయంలో తన ఆలోచన పూర్తిగా మారిపోయిందని స్పష్టం చేసింది.
తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసినట్లు చెప్పింది. గ్లామర్ పాత్రలు మాత్రమే కాకుండా కంటెంట్ ఉండి కథలో మంచి ప్రాధాన్యత ఉన్న రోల్స్ లో కనిపించడానికి ఆసక్తి ఎదురు చూస్తున్నాను అని చెప్పింది. ఇకపై తాను చేయబోయే సినిమాల్లో ఖచ్చితంగా తన పాత్ర కొత్తగా ఉండే విధంగా చూసుకుంటానని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నట్లు తెలిపింది. మొత్తానికి తమన్నా ప్రస్తుతం తనని తాను నటిగా ప్రూవ్ చేసుకునే పాత్రల కోసం ఎదురుచూస్తుందని ఇంటర్వ్యూ ద్వారా స్పష్టం చేసింది. మరి అలాంటి పాత్రలను దర్శకులు ఎంతవరకు ఆఫర్ చేస్తారు అనేది చూడాలి.