తనుశ్రీ దత్తా… ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేశ వ్యాప్తంగా క్యాస్టింగ్ కౌచ్ పై జరిగిన మీటూ ఉద్యమానికి మూలకర్త ఈమెనే అని చెప్పాలి. బాలీవుడ్ లో తనకి ఎదురైనా లైంగిక వేధింపుల గురించి మీడియాతో పంచుకున్న మొదటి వ్యక్తి ఈమె. తనని వేధించిన వారి పేర్లతో సహా ఈమె అప్పట్లో బయట పెట్టింది. ఇక ఈమె వ్యాఖ్యల అనంతరం బాలీవుడ్ లో చాలా మంది ఒక్కొక్కరుగా బయటకి వచ్చి తమకి ఎదురైన వేధింపుల పర్వం గురించి పెదవి విప్పారు. దీంతో అదో ఉద్యమంగా మారిపోయింది. మీటూ పేరుతో దేశ వ్యాప్తంగా పెద్ద ఉద్యమమే నడిచింది. ఈ ఉద్యమం ఉనికి ప్రస్తుతం అంతగా లేకపోయిన దీని గురించి మాట్లాడితే మాత్రం అందరికి తనుశ్రీ దత్తా గుర్తుకొస్తుంది.
ఇమ్రాన్ హష్మీతో అంతకు ముందు చేసిన ఒక సినిమాతో ఈ భామ బాలీవుడ్ లో ఫేమస్ అయ్యింది. తెలుగులో కూడా బాలకృష్ణకి జోడీగా వీరభద్ర అనే సినిమాలో నటించింది. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో టాలీవుడ్ లో కూడా ఈమెకి అవకాశాలు రాలేదు. చేసినవి తక్కువ సినిమాలే అయినా మీటూతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా ఎట్రాక్షన్ గా మారిపోయింది. ఇదిలా ఉంటే చాలా కాలం తర్వాత మరల ఈ అమ్మడు సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ మాఫియాకి చెందిన కొంత మంది తనని టార్గెట్ చేస్తూ వేధింపులకి పాల్పడుతున్నట్లు ఇన్స్టాగ్రామ్ లో పెద్ద మెసేజ్ పెట్టింది.
నన్ను వేధించి చంపాలని చూస్తున్నారని, దయచేసి నాకు ఎవరైనా సాయం చేయండి అని ఆ పోస్ట్ లో పేర్కొంది. తాను గతంలో ఎవరి మీద ఆరోపణలు చేసానో వారే తన వేధింపుల వెనుక ఉన్నారని రాసుకొచ్చింది. నన్ను టార్గెట్ చేయడం వలన బాలీవుడ్ మాఫియాకి తప్ప ఎవరికీ ఎలాంటి లాభం లేదని కూడా చెప్పింది. తన ప్రాణాలకి ముప్పు ఉందని ఆ పోస్ట్ లో తనుశ్రీ దత్తా రాసింది. ఈ పోస్ట్ కాస్తా ఇప్పుడు వైరల్ గా మారడంతో బిటౌన్ ని షేక్ చేస్తుంది. దీనిపై ఎవరైనా స్పందిస్తారేమో అనేది వేచి చూడాలి.