రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ టీడీపీ పార్టీలో ఉన్న కీలక నాయకులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. తెలంగాణ పోరాటంలో వారి భాగస్వామ్యం లేకపోయిన కూడా కేసీఆర్ పిలిచి మరీ వారికి పదవులు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో బలోపేతం కావడానికి టీడీపీ నుంచి వెళ్ళిన నాయకులు కూడా ఒక కారణం అని చెప్పాలి. ఇక రేవంత్ రెడ్డి లాంటి లీడర్ కూడా టీడీపీతో తెలంగాణలో తనకి భవిష్యత్తు ఉండదని భావించి కాంగ్రెస్ గూటికి వెళ్ళిపోయారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా మారిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడం ద్వారా ముఖ్యమంత్రి కావాలని రేవంత్ రెడ్డి కలలు కంటున్నారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ పార్టీ కాస్తా బీఆర్ఎస్ గా పేరు మార్చుకొని ఏపీ రాజకీయాలలోకి అడుగుపెడుతుంది.
కేసీఆర్ ఏపీపై ఫోకస్ చేయడంతో పాటు ముఖ్యంగా చంద్రబాబుని టార్గెట్ చేయడానికి అనే మాట వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో చంద్రబాబు తెలంగాణపై ఫోకస్ పెట్టారు. అక్కడ పార్టీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ని నియమించారు. అలాగే పార్టీ క్యాడర్ ని ఉత్తేజం చేసే పని మొదలు పెట్టారు. పాతనాయకులు అందరిని కూడా మళ్ళీ తిరిగి పార్టీలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీని మళ్ళీ బలోపేతం చేసే బాద్యత తీసుకున్న కాసాని జ్ఞానేశ్వర తెలంగాణలో ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
దీని ద్వారా ప్రతి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పార్టీ క్యాడర్ ని దిశానిర్దేశ్యం చేశారు. పార్టీకి పునరుత్తేజం తీసుకురావాలని నాయకులని కోరారు. పార్టీని బలోపేతం చేయడం ద్వారా ప్రజలలో మనకున్న బలాన్ని మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. మరి కాసాని జ్ఞానేశ్వర్ చేస్తున్న ఈ ప్రయత్నం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తిరిగి పుంజుకోవడానికి ఎంత వరకు ఛాన్స్ ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.