గాజువాక ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్య పై 1999 లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శాశ్వత పరిష్కారం చూపకుండా హౌస్ కమిటీ ఏర్పాటు చేశారని గాజువాక ఎమ్మెల్యే తిప్పలు నాగిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మద్దిలపాలెంలో ఉన్న వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 1999లో ఏర్పడిన సమస్యకు 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి బాధితుల గోడు విని ఈ హౌస్ కమిటీ భూములను క్రమబద్ధీకరించి భూ బాధితులను ఆదుకోవడానికి తొలి అడుగు వేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మళ్ళీ 24 ఏళ్ల తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ హౌస్ కమిటీ భూముల సమస్యకు పరిష్కారం చూపారని దీనికి గాజువాక ఎమ్మెల్యే తిప్పలు నాగిరెడ్డి నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జీవో నంబర్ 44ను జారీ చేసి హౌస్ కమిటీ భూముల క్రమబద్ధీకరణకు శ్రీకారం చుట్టారు. పోరంబోకు మాములుగా నిర్ణయించిన 545 ఎకరాల్లో 2004 మంది స్థలాలను క్రమబద్ధీకరించారు. వారిలో 100 గజాలలోపు ఉన్నవారికి ఉచితంగా క్రమబద్ధీకరణ పట్టాలను అందజేశారు. 355 ఎకరాల్లో భూముల క్రమబద్ధీకరణకు శ్రీకారం చుట్టాలని జీవోలో పేర్కొన్నారు. ఆయన మరణం తరువాత ఆ జీవో అమలు ఆగిపోయిందని ఆ తరువాత అధికారం చేపట్టిన ప్రభుత్వలు ఈ విషయంపై శ్రద్ధ చూపకపోవడంతో ఈ హౌస్ కమిటీ భూముల సమస్య యధాతథంగా మిగిలిపోయిందని వ్యాఖ్యానించారు.
2014లో షరతులతో చంద్రబాబు పట్టాలు
2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఇచ్చిన పట్టాలను రద్దు చేయడంతోపాటు హౌస్ కమిటీ బాధితులకు షరతులతో కూడిన పట్టాలను ఇచ్చారు. జీవో నంబర్ 301, ఆ తరువాత తీసుకొచ్చిన 279 జీవోల ద్వారా 6,387 మందికి షరతులతో కూడిన పట్టాలను అందజేశారు. లబ్ధిదారులకు ఆ పట్టాలు ఏ రకంగాను ఉపయోగపడలేదని తమ అవసరాలకు ఆస్తిని అమ్ముకోవడానికి గాని, వారసులకు బదిలీ చేసుకోవడానికి గాని ఆవకాశం లేకుండా పోయిందని తెలిపారు.
హౌస్ కమిటీ భూముల పై సీఎం జగన్ ప్రత్యేక చొరవ
గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన నాయకులెవరూ నియోజకవర్గ సమస్యలపై దృష్టి సారించకుండా అవినీతికి పాల్పడుతూ లబ్ధి పొందడానికి చూశారని నేను ఎమ్మెల్యే అయిన తరువాత ఈ హౌస్ కమిటీ భూముల సమస్యను ప్రత్యేక చొరవతో సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వెంటనే సానుకూలంగా స్పందించి ఈ సమస్య పరిష్కారానికి సంబంధించి ప్రజలకు లబ్ధి చేకూరేలా మార్పులు చేర్పులు చేసి జీవో విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. దీనితో పాటు నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలను సీఎం దృష్టి తీసుకెళ్లడం జరిగిందని వాటి పరిష్కారానికి కూడా తొందరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అంతేకాకుండా గత జీవోలో 25 సంవత్సరాలకు హక్కుదారులుగా మారతారని పేర్కొనగా దానిని సీఎం జగన్ 10 సంవత్సరాలకు కుదించినట్టు తెలిపారు. ఈ భూములపై తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్ష నాయకులు వైసీపీ ప్రభుత్వం పై నిందలు వేస్తున్నారని ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్న మీరెందుకు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదని ప్రతిపక్ష నాయకులను ఆయన ప్రశ్నించారు. తన మన అనే బేధం లేకుండా సమన్యాయమే ధ్యేయంగా సీఎం జగన్ పాటుపడుతున్నారని హౌస్ కమిటీ బాధితులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే నెల రోజుల్లో తప్పులను సరిచేసి నూతన పట్టాలను ప్రభుత్వం జారీ చేస్తుందని గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి ఆయన తెలిపారు.
విశాఖ నగర అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ పాదయాత్రలో పారిశ్రామిక ప్రాంత ప్రజలు పడుతున్న సమస్యలను తెలుసుకున్న సీఎం జగన్ ఈ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారని ఈ హౌస్ కమిటీ సమస్యకు ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ వై వి సుబ్బారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని కృషి చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలిపారు