Uber Cab : ఒకప్పుడు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లాలంటే కేవలం రిక్షాలోనే.. ఆ తరువాత కాలం మారింది. ఆటోలు వచ్చాయి. ఆ తరువాత సిటీ బస్సులు వచ్చాయి. ఇప్పుడంతా హైటెక్ యుగం. ఇంట్లో కూర్చొని మొబైల్ నొక్కితే చాలు కారు వచ్చి మన ఇంటి ముందు వాలిపోతుంది. బేరం కుదుర్చుకోవాల్సిన పని లేదు. ఉబెర్, ఓలా సర్వీసులు వచ్చాక.. ప్రయాణికులు ఆయా యాప్‌లలో సింపుల్‌గా క్యాబ్‌లను బుక్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉబెర్.. ఓ ప్రయాణికుడికి షాకిచ్చింది. అతడి నుంచి వసూలు చేసిన చార్జ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన దేబర్షి దాస్‌గుప్తా.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని టర్మినల్ 2 నుంచి నోయిడాలో ఉన్న తన ఇంటికి వెళ్లేందుకు ఉబెర్ యాప్‌లో క్యాబ్‌ను బుక్ చేసుకున్నాడు. ఇల్లు చేరిన తర్వాత బిల్లు కడదామని చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. దీనికి కారణం కేవలం 45 కిలో మీటర్ల ప్రయాణానికి రూ.2,935 బిల్ రావడంతో కంగుతిన్నాడు. చివరికి చేసేదేమీ లేక.. ఆ మొత్తాన్ని చెల్లించేశాడు. అనంతరం తనకు జరిగిన అన్యాయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు.
Uber Cab : 45 కి.మీ ప్రయాణిస్తే.. 149 కి.మీ ప్రయాణించినట్లు చూపించిన ఉబెర్
‘నేను 45 కిలోమీటర్లు ప్రయాణిస్తే.. 149 కిలో మీటర్ల ప్రయాణించినట్లు ఉబెర్‌లో చూపించింది. అందుకుగాను రూ.2,935 బిల్లు చెల్లించాల్సి వచ్చింది’ అని దేబర్షి దాస్ గుప్తా వాపోయాడు. అంతేకాకుండా తన నుంచి వసూలు చేసిన అధిక మొత్తాన్ని తిరిగి తన ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు సైతం గుప్తాకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇదే సమయంలో తమకు జరిగిన అన్యాయాన్ని కూడా గుర్తు చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. క్యాబ్‌ల విషయంలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. సోషల్ మీడియా వెలుగులోకి వచ్చాక ఇలాంటి విషయాలన్నీ త్వరగా ప్రపంచమంతా పాకిపోతున్నాయి. ఈ ఘటనపై ఊబెర్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.