జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా వైసీపీని గద్దె దించాలని భావిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు దగ్గర పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకుని అమ్ముడుపోయాడంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది. అలాగే వైసీపీకి సపోర్ట్ గా ఉండే రాజకీయ విశ్లేషకులు మీడియా వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబుని మళ్లీ సీఎం చేయాలని జనసైనికులు ఆకాంక్షను తుంగలో తొక్కి ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే తాజాగా ఈ అంశాలపై కాంగ్రెస్ మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకులు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవడం తన వ్యూహాత్మక నిర్ణయంలో భాగమే అని అన్నారు. పవన్ కళ్యాణ్ అందరూ అనుకున్నంత అమాయకుడైతే కాదని, తనని సీఎం అభ్యర్థిగా ఒప్పుకుంటేనే టీడీపీతో కలిసి వెళ్లడానికి అంగీకరిస్తారని అన్నారు. ఒకవేళ టీడీపీ పవన్ కళ్యాణ్ నిర్ణయానికి ఒప్పుకోకుంటే రానున్న ఎన్నికల్లో జనసేనకి జరిగే నష్టమేమీ ఉండదని చెప్పుకొచ్చారు. అయితే జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే టీడీపీని భూస్థాపితం చేయడం మాత్రం గ్యారెంటీ అని అన్నారు. ఇలాంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీని మళ్ళీ నిలబెట్టుకోవాలన్న, బ్రతికించుకోవాలన్నా కచ్చితంగా చంద్రబాబు నాయుడు రెండు అడుగులు వేసి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉందని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
పవన్ కళ్యాణ్ కూడా ఇదే ఆలోచనతో టీడీపీకి పొత్తు ప్రతిపాదనని పంపించి ఉండవచ్చని భావిస్తున్నారు. జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంటే మాత్రం కచ్చితంగా వైసీపీని అధికారానికి దూరం చేసే ఛాన్స్ ఉందని ఉండవల్లి అంచనా వేశారు. అయితే పొత్తు అనే అంశంపై ఇప్పటికి పవన్ కళ్యాణ్ టీడీపీకి స్పష్టమైన క్లారిటీ ఇచ్చారని, జనసైనికులు కోరుకున్న విధంగా తనని ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అంగీకరిస్తే పొత్తు ఉంటుంది అని యువశక్తి సభ వేదికగా పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారు.
ఇదే విషయాన్ని అరుణ్ కుమార్ కూడా ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ అమాయకంగా ఏమీ పొత్తుల గురించి మాట్లాడడం లేదని, తనకున్న వ్యూహాలు తనకున్నాయని మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. అయితే వైసీపీని సపోర్ట్ చేసే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఉండవల్లి కామెంట్స్ పై మరో రకంగా రియాక్ట్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం లేదని, కేవలం అతని లక్ష్యం జగన్ రెడ్డిని అధికారానికి దూరం చేయడమే అని దానికోసం ఎంతకైనా దిగుతారు అంటూ విమర్శిస్తున్నారు. చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడమే పవన్ కళ్యాణ్ లక్ష్యం అని ప్రచారం చేస్తున్నారు.