Vani Jayaram: కొద్ది రోజుల క్రితం టాలీవుడ్ దర్శక దిగ్గజం, లెజెండ్రీ దర్శకుడు కె విశ్వనాథ్ అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో తెలుగు చిత్రపరిశ్రమ ఒక్కసారిగా మూగబోయింది. ఆయన సినిమాకి, సాహిత్యానికి చేసిన సేవలని ప్రతి ఒక్కరు గుర్తుచేసుకున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి అయితే ఏకంగా ఆయన మరణంతో భావోద్వేగానికి గురయ్యాడు. భారతీయ సాహిత్యం, సంగీతం, నృత్యానికి పట్టం కట్టి చిత్రాలు చేసిన విశ్వనాథ్ చనిపోవడంతో ఇకపై అలాంటి సినిమాలని కేవలం మ్యూజియంలో పెట్టుకోవడమే తప్ప తీసే దమ్ము ఎవరూ చేయలేరు. ఇక జనవరి నెలలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ జమున మృతి చెందింది. ఇలా ఇద్దరు లెజెండ్రీ సెలబ్రిటీల మరణం వార్తలు మరిచిపోకముందే `సుప్రసిద్ధ గాయని వాణి జయరాం మృతి చెందిన వార్త బయటకి వచ్చింది.

ఆమె చెన్నైలో తన నివాసంలోనే అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె వయస్సు 78 సంవత్సరాలు. గాయనిగా ఆమె సుదీర్ఘ ప్రస్థానం కలిగి ఉంది. ఐదు దశాబ్దాలుగా నేపధ్యగాయనిగా ఏకంగా 20 వేల పాటలని ఆమె పాడటం విశేషం. తమిళనాడుకి చెందిన వాణి జయరాం కేవలం మాతృభాషలోనే కాకుండా దక్షిణాది భాషలన్నింటిలో కూడా అద్బుతమైన పాటలని పాడింది. అలాగే హిందీతో పాటు ఇతర భారతీయ భాషలలో కూడా ఆమె పాటలు పాడటం విశేషం. కేవలం సినీ పాటలు మాత్రమే కాకుండా ఎన్నో భక్తి గీతాలు కూడా వాణి జయరాం ఆలపించడం విశేషం.
ఇక తెలుగులో ఆమె 1992లో కె విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన స్వాతి కిరణంలో పాటలు పాడింది. సంగీత ప్రాధాన్యంగా తెరకెక్కిన ఈ సినిమాలు అన్ని పాటలు అద్భుతంగా ఉంటాయి. అలాంటి సినిమాలో తెలుగులో ఆమె చివరిగా పాడింది. యాదృశ్చికంగా ఏంటంటే కె విశ్వనాథ్ చనిపోయిన మరుసటి రోజే వాణి జయరాం కూడా మృతి చెందడం. ఇక 2023కి గాను ఆమె సంగీతానికి అందించిన సేవలకి గాను పద్మవిభూషణ్ కి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇంతలో ఆమె మృతి చెందడం గమనార్హం. ఆమె మృతి పట్ల యావత్ భారతదేశంలో సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ నివాళి అర్పిస్తున్నారు.