హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా అడుగుపెట్టి మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన కుర్ర హీరో వరుణ్ సందేశ్. ఇక అతను సోలో హీరోగా వచ్చిన వచ్చిన కొత్త బంగారు లోకం సినిమా అయితే వరుణ్ కి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చి మంచి జోష్ తీసుకొచ్చింది. ఇక ఆ తరువాత ఈ కుర్ర హీరోకి వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. నిర్మాత దిల్ రాజు వరుణ్ సందేశ్ తో కొత్త బంగారు లోకం సినిమాతో పాటు కమల్ హాసన్ హిట్ మూవీ మరో చరిత్రని రీమేక్ కూడా చేసాడు. అయితే మరో చరిత్ర ఊహించని స్థాయిలో డిజాస్టర్ అయింది. తరువాత పెద్ద బ్యానర్స్ లో ఈ యంగ్ హీరోకి అవకాశాలు రాకపోయిన వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు.
అయితే ఆ సినిమాలలో ఏవీ కూడా వరుణ్ సందేశ్ ఇమేజ్ ని పెంచలేకపోయాయి. చేతులారా కెరియర్ ని పోగొట్టుకున్నట్లు అతని పరిస్థితి అయిపోయింది. దీంతో కొంత కాలం సినిమాలకి గ్యాప్ ఇచ్చి యూఎస్ వెళ్ళిపోయాడు. తరువాత అడపదడపా సినిమాలు అయితే చేస్తున్నాడు. కానీ సక్సెస్ ఇచ్చే సినిమా మాత్రం పడటం లేదు. ఆ మధ్య ఇందువదన అంటూ హర్రర్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. అది కూడా డిజాస్టర్ అయ్యింది. కెరియర్ పూర్తిగా గాడి తప్పిన తర్వాత సినిమా అవకాశాలు కూడా వరుణ్ కి తగ్గిపోయాయి. ఆ సమయంలో బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసి మళ్ళీ ఫేమ్ తెచ్చుకున్నాడు.
చాలా గ్యాప్ తర్వాత మరల ఇప్పుడు సరికొత్తగా ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. ఇప్పటి వరకు కెరియర్ లో చేయని విధంగా ఫుల్ మాస్ లుక్ తో సక్సెస్ కొట్టాలని కసితో రంగంలోకి దిగాడు. యద్భవం తద్భవతి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ని సందీప్ కిషన్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో గడ్డంతో, ఒక చేతికి బేడీలు వేసి ఉండగా మరో చేత్తో గన్ పట్టుకొని సిగరెట్ తాగుతూ కనిపించిన ఈ లుక్ కాస్తా డిఫెరెంట్ గానే ఉంది. టైటిల్ బట్టి ఈ సారి వరుణ్ డిఫెరెంట్ సబ్జెక్టుతోనే ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది. మరి ఈ సినిమా అతనికి ఎంత వరకు సక్సెస్ అందిస్తుంది అనేది వేచి చూడాలి.