VidyaSagar Reddy : లెజెండరీ నటి జమున గారి తర్వాత టాలీవుడ్ మరో సీనియర్ ఫిల్మ్ పర్సనాలిటీని కోల్పోయింది. తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ దర్శకుడు విద్యా సాగర్ రెడ్డి కన్నుమూశారు . ఈ రోజు ఉదయం 05 గంటల 20 నిమిషాలకు చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
దర్శకుడు విద్యా సాగర్ రెడ్డి వయసు 70 ఏళ్లు. గత కొంత కాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు . 1952లో గుంటూరులో జన్మించిన దర్శకుడు విద్యా సాగర్ రెడ్డి పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు చాలా సినిమాలకు ఎడిటర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 1983లో విడుదలైన రాకాసి లోయా చిత్రం లోసం తొలిసారిగా మెగాఫోన్ పట్టారు.

1991 లో స్టువర్టుపురం దొంగలు సినిమా దర్శకుడిగా మంచి గుర్తింపు తీసుకు వచ్చిన సినిమా. ఈ చిత్రం దాదాపుగా 3 నంది అవార్డులను కూడా గెలుచుకుంది. అమ్మ దొంగ, అన్వేషణ , ఓసి నా మరదలా వంటి సినిమాలు అయన కెరీర్ లో ఆణిముత్యాలు . విద్యా సాగర్ రెడ్డి దర్శకత్వం వహించిన చివరి చిత్రం ఖైదీ బ్రదర్స్ . విద్యా సాగర్ రెడ్డి దగ్గర అసిస్టెంట్ లుగా పనిచేసిన శ్రీను వైట్ల, వి.వి. వినాయక్, రవి కుమార్ చౌదరి,జి. నాగేశ్వర రెడ్డి లు సినిమా డైరెక్టర్లుగా మంచి పేరు తెచ్చుకున్నారు. అంతే కాదు సాగర్ మూడు పర్యాయాలు తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షునిగా పనిచేశారు.
సీనియర్ డైరెక్టర్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈరోజు సాయంత్రం చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.