గత రెండేళ్ల కాలం నుంచి వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు ఎమ్మెల్యేలు విశాఖ పరిపాలన రాజధాని అంటూ ఊదరగొడుతున్నారు. రెండు నెలల్లోనే విశాఖ నుంచి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన మొదలుపెడతారని గత రెండేళ్ల కాలం నుంచి చెప్పిన మాటే తిప్పి తిప్పి చెబుతున్నారు. మరోసారి ఐటి మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మరో రెండు నెలల్లో విశాఖ నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొదలు పెడతారని విలేకరుల సమావేశంలో చెప్పుకొచ్చారు. వైసిపి ప్రభుత్వం మూడు రాజధానుల అంశానికి కట్టుబడి ఉందని అన్నారు.
ఈనెల 30న సుప్రీంకోర్టులో మూడు రాజధానులు అంశంపై విచారణ జరగనుంది. ఈ విచారణలో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశతోనే వైసిపి ప్రభుత్వం భావిస్తుంది. అయితే మూడు రాజధానులు అంశంపై ఇప్పటికే పలుమార్లు హైకోర్టు వైసిపి సర్కార్ కి చివాట్లు పెట్టింది. రాజధాని మార్చే అధికారం శాసనసభకు లేదని హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలోనే మరోసారి దీనిపై విచారణ జరగబోతుంది. దీంతో తమకు అనుకూలంగానే సుప్రీంకోర్టు తీర్పు ఉంటుందని వైసిపి అధిష్టానం భావిస్తుంది.
ఇందులో భాగంగానే మంత్రి అమర్నాథ్ విశాఖ నుంచి రెండు నెలల్లో పాలన ప్రారంభిస్తారని చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఉత్తరాంధ్ర నేతలు అక్కడ ప్రజలను పదేపదే విశాఖ రాజధాని అంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేవలం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి మాత్రమే ఈ రకమైన ప్రచారాన్ని వైసీపీ నేతలు పదేపదే చేస్తున్నారని విమర్శిస్తున్నాయి. రాజధాని అమరావతి నుంచి మార్చే ధైర్యం వైసిపి ఎట్టి పరిస్థితుల్లో చేయలేదని అంటున్నాయి. విశాఖ రాజధాని అని చెప్పడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలను మభ్యపెట్టి, ఎన్నికల ముందు విపక్షాలు విశాఖను రాజధాని కాకుండా అడ్డుకున్నాయని, ప్రచారాన్ని తెరపైకి తేవడం ద్వారా లబ్ధి పొందాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.