VV Lakshminarayana: ఏపీ రాజకీయాలలో అన్ని పార్టీలు ఎవరికి వారు వచ్చే ఎన్నికలలో గెలుపు కోసం తమ వ్యూహాలని సిద్ధం చేసుకుంటూ ముందుకి వెళ్తున్నాయి. రాజకీయ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజలని ఆకర్షించే పనిని ఇప్పటి నుంచే మొదలుపెట్టాయి. ముఖ్యంగా ఈ రేసులో టీడీపీ, వైసీపీ పార్టీలు ముందు వరుసలో ఉన్నాయి. ఈ రెండు పార్టీలు అధికార పీఠంపై కూర్చోవడానికి తమ రాజకీయ చతురతని ఉపయోగించి ప్రజాక్షేత్రంలో ప్రజలకి చేరువ కావడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఏపీ రాజకీయాలలో మాజీ జేడీ వివి లక్ష్మినారాయణ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.

ఆయన గత ఎన్నికలలో జనసేన పార్టీ నుంచి విశాఖపట్నం ఎంపీగా బరిలో దిగారు. అయితే రెండు లక్షల పచికులు ఓట్లు సొంతం చేసుకున్న కూడా మూడో స్థానానికి పరిమితం అయ్యారు. తరువాత రాజకీయ పరిణామాల నేపధ్యంలో వివి లక్ష్మినారాయణ జనసేన నుంచి బయటకి వచ్చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఒంటరిగానే ప్రజాక్షేత్రంలో తిరుగుతున్న ఆయన వచ్చే ఎన్నికలలో ఎంపీగా మరల విశాఖపట్నం నుంచి పోటీ చేస్తానని ఖరారు చేశారు. అయితే తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తా అనేది ఇప్పుడే చెప్పలేనని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఏపీలో ఉన్న పార్టీలు తమ భావజాలం నచ్చి ఎవరైతే తనతో పనిచేయడానికి ఇష్టపడతారో వారు తనతో వచ్చి మాట్లాడితే అప్పుడు ఆ పార్టీలో చేరేది ఆలోచిస్తానని చెప్పారు. అయితే పార్టీలోకి ఆహ్వానించడం అంటే వివి లక్ష్మినారాయణ వెళ్లి కలిస్తే బాగుంటుంది కాని, తాను కావాలనుకొని వచ్చేవారితో తాను చర్చిస్తానని ఆయన చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఒక వేళ ఏ పార్టీ కూడా అతనిని ఆహ్వానించకపోతే ఒంటరిగానే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు.