Cab driver : క్యాబ్ డ్రైవర్స్ ఒక్కొక్కరూ ఒక్కోలా ఉంటారు. ప్రయాణికులు సైతం డిఫరెంట్‌గానే ఉంటారు. క్యాబ్ బుక్ చేసుకున్న వారితో డ్రైవర్ ప్రవర్తించే తీరును బట్టి ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడో చెప్పేయవచ్చు. కొందరు సౌమ్యంగా ఉంటారు.. మరికొందరి వ్యవహార శైలి మాత్రం కాస్త దురుసుగా ఉంటుంది. ఇక మరికొందరు మాత్రం అనుచితంగా ప్రవర్తిస్తారు. మూడో వారితో చాలా కష్టం. దురుసుగా ఉండే వారితో మనం కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక సౌమ్యంగా ఉండేవారితో అసలే ఇబ్బంది లేదు. కానీ కొందరు మాత్రం చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్‌ను కలిగి ఉంటారు. అయితే మనం అపార్థం చేసుకోకుంటే చాలు. ఆ హ్యూమర్‌ను మనం కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఓ మహిళ, క్యాబ్ డ్రైవర్ మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇది నవ్వుల పువ్వులు పూయిస్తోంది.
Cab driver : అతనిచ్చిన రిప్లైతో కంగారు మొదలైంది..
అసలు విషయం ఏంటంటే.. ఢిల్లీకి చెందిన రియా కస్లీవాల్ అనే మహిళ జులై 20న ఢిల్లీలో జోరుగా వర్షం పడుతున్న సమయంలో ఉబర్ యాప్‌లో క్యాబ్ బుక్ చేసుకుంది. ఒక వైపు వర్షం జోరందుకుంది. మరి ఈ వర్షంలో సదరు డ్రైవర్ వస్తాడో లేదో అనే అనుమానం. ఎందుకైనా మంచిది ఒకసారి నిర్ధారించుకుందామని యాప్‌లో ఉన్న చాట్ ఆప్షన్‌లో అతనితో సంభాషించింది. డ్రాప్ లొకేషన్ ఎక్కడ అని డ్రైవర్ ఆమెను చాట్‌లో అడిగాడు. గ్రీన్ పార్క్ సార్ అని సదరు మహిళ సమాధానమిచ్చింది.ఈ జోరు వానలోనా అని ఉబర్ డ్రైవర్ బదులిచ్చాడు. అతనిచ్చిన స్పందనతో ఆమెలో కంగారు మొదలైంది. అతను రాకుంటే ఇబ్బంది పడతానని భావించిన మహిళ మీరు వస్తున్నారు కదా? అని అడిగింది. ఈ ప్రశ్నకు కూడా క్యాబ్ డ్రైవర్ కాస్తంత బద్ధకంతో ఇప్పుడేం చేయాలి?అని రిప్లై ఇచ్చాడు.
చూడబోతే రైడ్‌ను డ్రైవర్ క్యాన్సిల్ చేసేలా ఉన్నాడని భావించిన రియా మళ్లీ ఒక్కసారి అడుగుదామన్నట్టుగా మీరు వస్తున్నారా సార్..? అని మెసేజ్ చేసింది. ఈ ప్రశ్నకు సదరు ఉబర్ క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన రిప్లై నవ్వులు పూయించింది. ‘మీరు వస్తున్నారా సార్’..? అని ఆమె అడిగిన ప్రశ్నకు బదులిస్తూ మూడ్ లేదని బదులిచ్చాడు. ఈ సంభాషణను సదరు మహిళ స్క్రీన్‌షాట్ తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. సమాధానం నిజాయతీగా చెప్పాడని ఆ ఉబర్ డ్రైవర్‌ను కొందరు నెటిజన్లు మెచ్చుకున్నారు. అసలు ఇది క్యాబ్ డ్రైవర్, ప్యాసింజర్ మధ్య సంభాషణ అనుకోలేదని.. ఇదేదో రొమాంటిక్ యాప్‌లో సంభాషణ అనుకున్నానని, విషయం తెలిసిన తర్వాతే ఉబర్ అని గ్రహించానని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. మొత్తానికి ఈ సంభాషణపై కామెంట్ల మీద కామెంట్స్ చాలా ఆసక్తికరంగా వస్తున్నాయి.