Wrestlers : భారత రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, దాని చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై భారత అగ్రశ్రేణి రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, రవి దహియా , దీపక్ పునియా శుక్రవారం భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు PT ఉషాకు లేఖ రాశారు.
ఒలింపియన్ వినేష్ ఫోగట్ టోక్యోలో ఒలింపిక్ పతకాన్ని కోల్పోయినప్పటి నుంచి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడి తనను మానసికంగా వేధించాడని, హింసించాడని ఆ లేఖలో ప్రస్తావించారు. అంతే కాదు అధ్యక్షుడి తీరువల్ల ఆమె ఆత్మహత్య గురించి ఆలోచించేలా చేసిందని పేర్కొన్నారు.
WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదులపై విచారణకు ఒక కమిటీని నియమించాలని ఐఓఏను రెజ్లర్లు అభ్యర్థించారు. రెజ్లర్ల కాంట్రాక్ట్ చెల్లింపుల విషయంలోనూ డబ్ల్యూఎఫ్‌ఐ దుర్వినియోగానికి పాల్పడిందని లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా జరిగిన రెజ్లర్ల నిరసనలో ఏస్ బాక్సర్ విజేందర్ సింగ్ పాల్గొన్నారు. బ్రిజ్ భూషణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఆయన, ఈ సమస్యపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనాన్ని ప్రశ్నించారు. రాజీనామా చేయాలనే ఒత్తిడితో బ్రిజ్ భూషణ్ శుక్రవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో ఇదంతా రాజకీయ కుట్రని దీనిని బహిర్గతం చేస్తానని చెప్పారు. ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
ప్రభుత్వం తక్షణమే డబ్ల్యుఎఫ్‌ఐని రద్దు చేయాలనే తమ డిమాండ్ నుండి వెనక్కి తగ్గడానికి వారు నిరాకరించడంతో గురువారం రాత్రి కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో భారత అగ్రశ్రేణి రెజ్లర్ల సమావేశం అసంపూర్తిగా మిగిలిపోయింది. డబ్ల్యుఎఫ్‌ఐ అధ్యక్షుడికి వ్యతిరేకంగా రెజ్లర్ల నిరసన కొనసాగిస్తున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై మధ్యాహ్నం 3 గంటలకు రెజ్లింగ్ సమాఖ్య క్రీడా మంత్రిత్వ శాఖకు ప్రతిస్పందనను పంపుతుందని మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
ఇదిలా ఉండగా రెజ్లర్లు నిరసన చేపట్టి నేటికి 72 గంటలు అయిందని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ట్విట్టర్‌లో తెలిపారు. WFI అధ్యక్షుడి రాజీనామాను ఇప్పటి వరకు ఎందుకు కోరలేదు అని ప్రశ్నించారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయడం లేదు అని ఆమె ట్వీటర్‌లో స్పందించారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా రెజ్లర్లకు మద్దతుగా నిలిచారు. WFI చీఫ్‌పై లైంగిక , మానసిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా సిగ్గుచేటని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.