వైసీపీ నేతలు గడపగడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం చేస్తూ ప్రజల మధ్యకి వెళ్తున్నారు. జగన్ సూచన మేరకు వైసీపీ నేతలు ప్రజల దగ్గరకి వెళ్తూ సంక్షేమ పథకాల గురించి వారికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సంక్షేమ పథకాలతో ప్రజలు తమకి పట్టం కడతారని సీఎం జగన్ ఆశపడుతున్నాడు. కాని అభివృద్ధి, పెన్షన్ ల తొలగింపు, నిరుద్యోగం, మధ్య నిషేధం లాంటి కీలక అంశాలు జగన్ విస్మరించారు. ఈ నేపధ్యంలో వైసీపీ నేతలు స్థానికంగా ప్రజలలోకి వెళ్తే అక్కడ చాలా చోట్ల ప్రజలు వారిని నిలదీస్తున్నారు. జాబ్ క్యాలెండర్ గురించి, రహదారుల అభివృద్ధి గురించి, త్రాగునీటి సమస్యల పరిష్కారం గురించి గ్రామాలలో ఎమ్మెల్యేలని ఎవరు నిలదీసిన వారు టీడీపీ పార్టీకి లేదంటే జనసేన పార్టీకి చెందిన వారు అంటూ వారిపై దాడి చేస్తున్నారు.
కొంత మంది పోలీసులని ఉపయోగించి అరెస్ట్ లు చేయిస్తున్నారు. ప్రజలు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక వారిని తప్పించుకొని అసహనం ప్రదర్శిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. తరుచుగా సుమారు అన్ని నియోజకవర్గాలలో ఇలాంటి పరిస్థితి ఎమ్మెల్యేలకి ఎదురవుతుంది. తాజాగా విజయవాడలో దేవినేని అవినాష్ ఓ వార్డులో గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్ళారు. ఈ సమయంలో కొంత మంది మహిళలు పెన్షన్ ల తొలగింపుపై అవినాష్ ని నిలదీశారు. అర్హులైన వారికి కూడా కావాలని పెన్షన్ లు తొలగించారని ప్రశ్నించారు.
దీనిపై అవినాష్ వెంట ఉన్న వైసీపీ మహిళ కార్యకర్తలు ప్రశ్నించిన మహిళలపై దాడి చేశారు. మీరందరూ టీడీపీ పార్టీకి చెందిన వారంటూ వారిపై దాడికి పాల్పడ్డారు. అయితే ఈ దాడిపై మహిళలు కృష్ణపట్నం పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసిన కంప్లైంట్ తీసుకోవడానికి పోలీసులు ఆసక్తి చూపించలేదు. దీంతో మహిళలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకి దిగారు. వైసీపీ రౌడీలు తమపై దాడి చేస్తే ఫిర్యాదు కూడా పోలీసులు తీసుకోవడం లేదని వాపోయారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం వైసీపీ నేతలకి అలవాటుగా మారిపోయిందని సదరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.