ఏపీలో వైసీపీ పార్టీలో రోజురోజుకి నాయకుల మధ్య వర్గవిభేదాలు, అంతర్గత కుమ్ములాటలు ఎక్కువ అయిపోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో ఇంతకాలం సైలెంట్ గా ఉన్న నాయకులు అందరూ కూడా జూలువిదిలిస్తూ సొంత పార్టీలో ఉన్న తమ వ్యతిరేకులపై స్వరం పెంచుతున్నారు. ఢీ అంటే ఢీ అనుకునే స్థాయికి వెళ్ళిపోయారు. ఒకే మీటింగ్ లో నాయకులు ఇద్దరు పార్టిసిపేట్ చేస్తున్న వారు వెళ్ళిపోయిన తర్వాత కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఇవి తారాస్థాయికి చేరిపోయాయి. నెల్లూరులో మొదటిగా ఈ గ్రూప్ గొడవలు మొదలయ్యాయి. అక్కడ ఎమ్మెల్యేల మధ్య అస్సలు సత్సంబంధాలు లేవని చెప్పాలి. దీంతో ఎవరికి వారే అన్నట్లుగా వారి రాజకీయ వ్యవహారాలు నడుపుకుంటున్నారు. ఇక ప్రకాశం జిల్లాలో కూడా ఈ రచ్చ మొదలైంది. ఇప్పుడు కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, ఎంపీ బాలశౌరీ వర్గాలు ఒకరికి ఒకరు బాహాబాహీ కొట్టుకున్నారు.
ఓ మీటింగ్ లో ఇద్దరు నాయకులు పాల్గొన్నారు. వారు వెళ్ళిపోయిన తర్వాత కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు. ఇదే పరిస్థితి మచిలీపట్టణంలో కూడా ఉంది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో కూడా పలు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఎన్ చార్జ్ ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. గుంటూరు తాడికొండ నియోజకవర్గానికి ఇద్దరు ఇన్ చార్జ్ లని జగన్ నియమించారు. మరో వైపు స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి ఉన్నారు. ఈ ముగ్గురు కూడా ఎవరికి వారు అన్న విధంగానే కార్యక్రమాలు జరుపుకున్తున్నారు. అలాగే వారి కార్యకర్తలు కూడా గొడవలు పడుతున్నారు.
ఓ వైపు జగన్ రెడ్డి నాయకులందరికీ 175 స్థానాలలో గెలవాలని టార్గెట్ పెడుతూ ఉంటే వైసీపీలో అంతర్గత విభేదాలతో ఒకరికి ఒకరు కొట్టుకొని రచ్చకెక్కే వరకు వస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ఎవరికి ఎమ్మెల్యే టికెట్లు వస్తాయి అనేది వైసీపీ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఎలా అయిన అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేయాలనే ప్రయత్నం ఎవరికి వారు విడివిడిగా చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే వర్గపోరు బయటకి వస్తుంది. మరి వైసీపీ;లో ఉన్న అంతర్గత కలహాలని ప్రతిపక్షాలు ఎలా తమకి అనుకూలంగా మార్చుకుంటాయి అనేది వేచి చూడాలి.