ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్ళు పూర్తి చేసుకుంది. ఇక నవరత్నాలు మేనిఫెస్టోతో అధికారంలోకి వచ్చిన జగన్ మొదటి ఏడాది నుంచి వాటిలో అమలు చేస్తూ ఉచిత పథకాలతో ప్రజల ఖాతాలో డబ్బులు జమ చేస్తూ వస్తున్నారు. కొత్త కొత్త స్కీమ్స్ తీసుకొచ్చి రకరకాల పేర్లుతో డబ్బులు పంపిణీ చేస్తున్నారు. అభివృద్ధిని, పరిశ్రమల స్థాపన, ఉద్యోగ, ఉపాధి అంశాలని పూర్తిగా పక్కన పెట్టి కేవలం సంక్షేమాల మాటున డబ్బులు ప్రజల ఖాతాలలో వేస్తున్నారు. వీటి ద్వారా ప్రజా మద్దతు సొంతం చేసుకోవచ్చనే అజెండాతో సంక్షేమానికే వైసీపీ సర్కార్ పెద్ద పీట వేసింది. అయితే సంక్షేమ పథకాలు ఏవీ కూడా ఎమ్మెల్యేల ద్వారా ప్రజలకి అందించకుండా వాలంటీర్ల, గ్రామ సచివాలయ వ్యవస్థని ఏర్పాటు చేసుకొని దాని ద్వారానే పనులు అన్ని చక్కబెడుతున్నారు. ఈ నేపధ్యంలో ప్రజలకి, ఎమ్మెల్యేలకి మధ్య పెద్దగా సంబంధాలు ఉండటం లేదనే టాక్ వినిపిస్తుంది.
ఏదో పథకాలకి సంబందించిన చెక్కుల పంపిణీకి మాత్రమే చీఫ్ గెస్ట్ గా వస్తూ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఓ రెండు మాటలు చెప్పి వెళ్ళిపోతున్నారు. అయితే పాలన మొదలు పెట్టి మూడేళ్ళు పూర్తి కావడం జరిగింది. మరో వైపు విపక్ష పార్టీలైన తెలుగుదేశం, జనసేన విస్తృతంగా జనాల్లోకి వెళ్లి ప్రజా మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో అలెర్ట్ అయిన ముఖ్యమంత్రి జగన్ వైసీపీ ఎమ్మెల్యేలని పిలిచి సమావేశం పెట్టి గడపగడపకి వెళ్లి సంక్షేమ పథకాల గురించి ప్రజలకి చెప్పాలని, చాలా మంది ఎమ్మెల్యేల పనితీరుపై సంతృప్తి కరంగా లేనని చెప్పకనే చెప్పారు. ఈ రెండేళ్ళు పూర్తిగా ప్రజల మధ్యనే ఉండాలని కూడా సూచించారు. గెలిచే అవకాశాలు ఉన్నవారికే సీట్లు ఇస్తానని కరాఖండీగా చెప్పేశారు. అయితే జగన్ ఇచ్చిన అల్టిమేటంతో చాలా మంది ప్రజాప్రతినిధులు ప్రజలలోకి వెళ్తున్నారు. అయితే అక్కడ ప్రజల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి.
అభివృద్ధి జరగడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఉద్యోగాలు, మధ్య పాన నిషేధంపై ప్రశ్నిస్తున్నారు. దీంతో కొంత మంది ఎమ్మెల్యేలు ప్రజాతిరుగుబాటుతో వెనకడుగు వేసి ఏదో బొటాబొటీగా గడపగడప కార్యక్రమం నిర్వహిచుకొని వెళ్తున్నారు. ఇక వైసీపీ అధినాయకత్వానికి గ్రౌండ్ లెవల్ నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ ఇస్తున్న ఐప్యాక్ ఎమ్మెల్యేల పనితీరుపై మళ్ళీ సర్వే చెస్ జగన్ కి ఇచ్చినట్లు తెలుస్తుంది. దీనిలో మెజారిటీ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలు సంతృప్తికరంగా లేరని వచ్చినట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. మరో వైపు జనసేన కూడా రోజు రోజుకి బలం పుంజుకోవడంతో పాటు, టీడీపీతో కలిసి వెళ్తే గెలుపు అవకాశాలు సన్నగిల్లుతాయని సర్వే లో తేలినట్లు కూడా టాక్ వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో మరో సారి ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేలు అందరిని పిలిచి సుదీర్ఘంగా చర్చించడానికి సిద్ధమయ్యారని సమాచారం.