ఈ నెల 27 నుంచి కుప్పం నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రకి రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే డీజీపీ మాత్రం ఇప్పటి వరకు ఈ పాదయాత్రకి అనుమతి ఇవ్వలేదు. మరోసారి టీడీపీ యాత్రకి అనుమతులు కోరుతూ రివైండ్ లెటర్ కి డీజీపీకి పంపించారు. దానిపై డీజీపీ ఇప్పటి వరకు స్పందించలేదు. ఒక వేళ పోలీసుల నుంచి పర్మిషన్ రాకుంటే కోర్టుకి వెళ్లి తెచ్చుకోవాలని టీడీపీ భావిస్తుంది. ఇదిలా ఉంటే ఈ పాదయాత్రని ఎలా అయినా జరగకుండా ఆపాలని వైసీపీ అధిష్టానం యోచిస్తుంది. పాదయాత్ర ద్వారా నారా లోకేష్ జనంలోకి వెళ్తే వైసీపీ వైఫ్యలాలని ఎత్తి చూపించే అవకాశం ఉంది. ఒక వేళ నారా లోకేష్ పాదయాత్రకి భారీగా మద్దతు వస్తే అది కచ్చితంగా అన్ని నియోజకవర్గాలలో ప్రభావితం చేస్తుంది.
మీడియా కూడా ఈ పాదయాత్రకి హై ఫోకస్ ఇస్తుంది. ఈ నేపధ్యంలో పాదయాత్రని ఎలా అయినా అడ్డుకోవాలని వైసీపీ నేతలు సిద్ధం అవుతున్నారు. పాదయాత్రలో పాల్గొన్న వారిపై భౌతిక దాడులు చేసి భయపెట్టి తరువాత శాంతిభద్రతల సమస్య వస్తుందని చూపించి అడ్డుకోవాలని వైసీపీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినట్లు టీడీపీ కూడా భావిస్తుంది. ఈ నేపధ్యంలోనే తాజాగా కుప్పంలో కోదండరెడ్డి అనే వైసీపీ నేత వైసీపీ వాట్సాప్ గ్రూప్ లలో నారా లోకేష్ పాదయాత్రని అడ్డుకొని దాడులు చేయాలని ప్రేరేపిస్తూ మెసేజ్ లు పెట్టారు.
వీటిని స్క్రీన్ షాట్స్ తో సహా టీడీపీ నేతలు బయటపెట్టారు. దీనిపై పోలీసులకి కూడా ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే పోలీసులు ఈ హింసాత్మక సందేశాలపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో కూడా వేచి చూస్తాం అంటూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. పాదయాత్రకి ఆటంకం కలిగించి దాడులు చేసే కుట్రలు చేస్తే మాత్రం చూస్తూ ఊరికునేది ఉండదని కూడా అచ్చెన్నాయుడు హెచ్చరించారు. మరి వీటిపై పోలీసులు ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి.