YS Jagan: వైసీపీ పార్టీలో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న అందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో లేదంటే తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసిన వారే అనే విషయం అందరికి తెలిసిందే. ఓ విధంగా చెప్పాలంటే వైసీపీ తోనే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన నాయకులు ఎవరు కూడా ఆ పార్టీలో పెద్దగా కనిపించరు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు తోపాటు నాయకత్వం కూడా వైఎస్సార్సీపీకి టర్న్ అయిపోయింది. తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ లేకపోవడంతో ఆస్థానంలో కాంగ్రెస్ లో ఉన్న నాయకులు అందరు కూడా జగన్ గూటికి వలస వచ్చేసారు. అలాగే ప్రజారాజ్యం పార్టీలో కూడా ఎమ్మెల్యేలుగా అయినవారు చాలామంది జగన్ గూటికి వచ్చేసారు.

ఇప్పుడు వైసీపీలో వీరే కీలక నాయకులుగా ఉన్నారు. మొదటినుంచి పార్టీ కోసం పనిచేసిన నాయకులు ఇప్పటికి కూడా ద్వితీయ శ్రేణి నాయకులు గానే కొనసాగాల్సిన పరిస్థితి ఆ పార్టీలో ఉంది. అయితే దశాబ్దాలుగా పార్టీలు మారుతున్న నాయకులు మాత్రం మారడం లేదు అనే అసంతృప్తి ద్వితీయశ్రేణి నాయకుల్లో చాలా మందిలో ఉంది. ఒకే కుటుంబం ఆ కుటుంబం నుంచి వారసులు రాజకీయంగా ఎదుగుతున్నారు తప్ప క్రింది స్థాయిలో పనిచేసే నాయకులకు ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం లభించడం లేదని బాధ అన్ని పార్టీలలో క్రింది స్థాయి ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఉంది అని చెప్పాలి. అయితే గత కొంతకాలంగా వైసీపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఆ పార్టీ అధిష్టానం ద్వితీయశ్రేణి నాయకులపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది.
ముఖ్యంగా ఎన్నికల సమీపించే సమయంలో కనీసం 50 నుంచి 70 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీలోకి జంప్ అయిపోయే అవకాశం ఉందని జగన్ రెడ్డి దగ్గర పక్క సమాచారం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే వారు ఎవరనేది ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతానికి బయట పెట్టకపోయినా కూడా తన దగ్గర ఉన్న పూర్తి సమాచారంతో ఆయా నియోజకవర్గాలలో మళ్లీ జంపింగ్ నాయకులకి అవకాశం ఇవ్వకుండా ద్వితీయ శ్రేణి నాయకులని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.
ఈ నేపథ్యంలోనే ఇప్పటినుంచి ద్వితీయ శ్రేణి నాయకుల పై ప్రత్యేక దృష్టి సారించినట్లుగా సమాచారం. వారిలో సుదీర్ఘ కాలంగా పార్టీలో ఉంటూ బలమైన నాయకులుగా ఉన్నవారిని గుర్తించి వారికి పెద్దపీట వేయాలని వైసీపీ అధిష్టానం భావిస్తుంది. అలాగే నాయకత్వ లక్షణాలు ఉండి భవిష్యత్తులో ఎమ్మెల్యేలు అవ్వగలిగే సత్తా ఉన్న వారిని, ఆర్థికంగా బలంగా ఉన్న వారిని గుర్తించి ప్రోత్సహించాలని అనుకుంటున్నారు.