YS Jagan: రానున్న ఎన్నికలలో కూడా భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి రావాలని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దీనికోసం ఎప్పటికప్పుడు నియోజకవర్గ ఇన్ చార్జ్ లతో సమావేశం అవుతూ వారికి దిశానిర్దేశ్యం చేస్తున్నారు. మన లక్ష్యం 175 సీట్లు అంటూ చెబుతున్నారు. అది పెద్ద కష్టమేమీ కాదని కూడా వారికి భరోసా ఇస్తున్నారు. అలాగే గ్రామాలలో ప్రతి 50 ఇళ్ళకి ముగ్గురు గ్రామ సారథులు పార్టీ కోసం పనిచేసే వారు ఉండాలని, సంక్షేమ పథకాలని ప్రజలలోకి తీసుకెళ్ళే స్థాయిలో వారంతా పనిచేయాలని చెబుతున్నారు. వారిని ఏర్పాటు చేసే పనిలో నియోజకవర్గ ఇన్ చార్జ్ లు ఉన్నారు.

ఇదిలా ఉంటే టీడీపీ నుంచి నారా లోకేష్ పాదయాత్రతో జనాల్లోకి వచ్చారు. ఇక ఏప్రిల్ నుంచి పవన్ కళ్యాణ్ కూడా బస్సు యాత్ర చేయబోతున్నాడు. కచ్చితంగా రానున్న రోజుల్లో ఈ రెండు చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. గ్రామ సారథులని పెట్టుకొని ఎంతగా సంక్షేమ పథకాల గురించి ప్రజలకి తెలియజేసిన, వారు అభివృద్ధి, నిరుద్యోగం, ఉపాధి కల్పన అంశాలని ప్రధానంగా తీసుకొని ప్రజలలోకి వెళ్ళే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో ఇప్పటికే ఆ అంశాల విషయంలో ప్రజలలో కొంత వ్యతిరేకత ఉంది.
ఇది మరింత తీవ్రతరం కాకుండా ఉండాలంటే కచ్చితంగా తాను కూడా ప్రజలలో ఉండాలని జగన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ నేపధ్యంలోనే ఏప్రిల్ నుంచి ప్రజలలోకి వెళ్లాలని భావిస్తున్నారు. పల్లెనిద్ర పేరుతో ప్రతి మండలంలో ఓ రెండు గ్రామాలలో ప్రజలతో మమేకం కావడంతో పాటు ఆ గ్రామంలోనే నిద్రపోవడానికి సిద్ధం అవుతున్నారు. ఇలా ప్రజల మధ్యకి వెళ్లి వారితో కూర్చొని సమస్యలు పరిష్కరించడం ద్వారా ప్రజలకి భరోసా ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకి చేరువ కావడం కూడా జరుగుతుందని అనుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ పల్లెనిద్ర ప్రోగ్రామ్ కి సంబందించిన షెడ్యూల్ ని ప్లాన్ చేసే పనిలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది.