AP Politics: వైసీపీలో అంతర్గత పోరు రోజురోజుకి పెరిగిపోతుంది. ఒక్కొక్కరుగా అసమ్మతి నేతలు అందరూ బయటకి వస్తున్నారు. ముందుగా నెల్లూరులో ఈ ఎఫెక్ట్ చాలా గట్టిగా పడిందని చెప్పాలి. నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్యేలు ముగ్గురు అధిష్టానంపై వ్యతిరేక స్వరాన్ని వినిపించారు. అందులో ఇద్దరు ఇప్పటికే పార్టీకి దూరం అయిపోయారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ముందుగా అసమ్మతి స్వరం వినిపించి జగన్ కి షాక్ ఇచ్చారు. అయితే అతన్ని వెంటనే ఇన్ చార్జ్ బాద్యతల నుంచి తప్పించి వేరొకరికి అప్పగించారు. ఆ పనితో ఎమ్మెల్యేలని భయపెట్టాలని భావించారు. అయితే ఊహించని విధంగా రెండు నెలలు తిరగకముందే నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా ముఖంగా పార్టీకి దూరం అవుతున్నట్లు చెప్పడంతో పాటు ఫోన్ ట్యాపింగ్ చేసారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

అయితే ఈ ఆరోపణలపై వైసీపీ ఏం చేయాలో అర్ధంకాక తిరిగి ఎదురుదాడి చేసి అవి రికార్డ్ చేసిన మాటలు అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కోటంరెడ్డి చేసిన రచ్చ ఒక్కసారిగా వైసీపీ నాయకులలో కూడా కలవరం సృష్టించింది. మరో 35 మంది ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేసారని మీడియా ముఖంగా ఆయన చెప్పడం సంచలనంగా మారింది. దీంతో ఈ మాటల నేపధ్యంలో వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జ్ లు టెన్షన్ పడే అవకాశాలు ఉన్నాయని వైసీపీ అధిష్టానం గుర్తించింది. వెంటనే ఉపశమన చర్యలు మొదలు పెట్టడానికి జగన్ రెడ్డి సిద్ధం అయ్యారు.
అందులో భాగంగా నిన్ననే సజ్జల రామకృష్ణరెడ్డి, చీఫ్ సెక్రెటరి, అలాగే ఇంటలిజెన్స్ చీఫ్ తో సమావేశం అయ్యారు. కోటంరెడ్డి వ్యవహారంపై చర్చించారు. అనంతరం నేడు నాలుగు గంటలకి అన్ని నియోజకవర్గాల నాయకులతో జగన్ భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై జగన్ వారికి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని, అలాగే ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. కోటంరెడ్డి మాటలు వారంతా నిజమని నమ్మితే అసలుకె ప్రమాదం వస్తుందని భావించి ఇలా దిద్దుబాటు చర్యలకి జగన్ సిద్ధం అయినట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.