YS-Sharmila : దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోదరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిలా తెలంగాణ రాష్ట్రంలో తన దూకుడును పెంచింది. తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్రనుకొనసాగిస్తూ షర్మిల ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తోంది. తాజాగా షర్మిల తెలంగాణ రాష్ట్ర సీఎం నే టార్గెట్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు కొత్త బూట్లను కొనుగోలు చేసి , ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు తనతో కలిసి ఒకరోజు నడవాలని వైఎస్ షర్మిల గురువారం సవాల్ విసిరారు. షర్మిల తన ప్రజా ప్రస్థానం పాదయాత్రలో చివరి దశకు చేరుకున్నారు.

తన పాదయాత్రలో భాగంగా ప్రసంగం చేసిన వైఎస్ షర్మిల ఇలా మాట్లాడారు, ఈ రోజు, నేను ముఖ్యమంత్రికి ఒక రోజంతా మాతో కలిసి నడవాలని సవాలు చేస్తున్నాను, రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి సంతోషంగా ఉన్నారని, మీకు ఎలాంటి సమస్యలు లేవని మాకు చూపిస్తే, నేను రాజకీయాల నుండి తప్పుకుంటాను అని అన్నారు. నేను మీకు ఈ కొత్త బూట్లు బహుమతిగా ఇస్తున్నాను. నడవడానికి సరికొత్త జత బూట్లు ఇవి, ఇది మీ సైజు ప్రకారం ఉంది ఒకవేళ సరిపోకపోతే మార్చుకోవడానికి బిల్లు ఉంది అని తెలిపారు.

నిజానికి రైతులు పేదరికంలో కొట్టుమిట్టాడుతుంటే, సమస్యలతో అల్లాడుతుంటే కేసీఆర్ తన మాటకు కట్టుబడి దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలి అని షర్మిల అన్నారు. నవంబర్‌లో షర్మిల భారత్ రాష్ట్ర సమితి కార్యకర్తల దాడికి గురై తన పాదయాత్రను విరమించుకోవాల్సి వచ్చింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా షర్మిలను రెండు సార్లు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.