YSRCP: ఏపీలో అధికార పార్టీ వైసీపీ రానున్న ఎన్నికలని దృష్టిలో ఉంచుకొని బలమైన వ్యూహాలతో సిద్ధం అవుతుంది. ముందస్తు ఎన్నికల కోసం అన్ని రకాల బాణాలని సిద్ధం చేసుకొని ప్రజలలోకి పంపిస్తుంది. సంక్షేమమే అజెండాగా రానున్న ఎన్నికలలో ప్రజలలోకి వెళ్లి అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. దీనికోసం ఎప్పటికప్పుడు వైసీపీ కార్యవర్గ సభ్యులతో చర్చలు చేస్తూ తమ వ్యూహాలని ప్రజలలోకి తీసుకెళ్లడానికి ఉన్న మార్గాలని అన్వేషిస్తుంది. ఇందులో భాగంగానే గృహ సారథుల కాన్సెప్ట్ ని తెరపైకి తీసుకొచ్చింది. రానున్న ఎన్నికలలో వాలంటీర్లతో పార్టీ కార్యక్రమాలు చేయించుకోవడం కుదిరే పని కాదని ఎన్నికల సంఘం ఇప్పటికే తేల్చేసింది.
ఈ నేపధ్యంలో వాలంటీర్ల పరిధిలో గ్రహసారథులు అంటూ కార్యకర్తలని సిద్ధం చేయాలని నియోజకవర్గ ఇన్ చార్జ్ లని బాద్యతలు అప్పగించింది. ఆ దిశగా ఎమ్మెల్యేలు ఇన్ చార్జ్ లు అడుగులు వేస్తున్నారు. అయితే వారి వ్యూహాలకి తగ్గట్లుగా గ్రామ స్థాయిలో గృహ సారథుల నియామకం జరగడం లేదనేది రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. ఎవరూ కూడా రూపాయి కూడా ఆశించకుండా పార్టీ కూలీల మాదిరిగా పనిచేయాలి. అయితే ఉద్యోగాలు మానేసి, పనీపాట లేకుండా గ్రామాల్లో తిరిగితే తల్లిదండ్రులు ఒప్పుకోరు. రాజకీయాలు అంటూ తిరిగితే అస్సలు ఒప్పుకోరు. దీంతో యువత ఎవరు కూడా వైసీపీ గ్రామ సారథులుగా ఉండేందుకు ముందుకి రావడం లేదు.

ఒక వేళ గ్రామ సారథులుగా ఉన్నా కూడా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తే ప్రజలలో ఉన్న అసహనం తాము ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడుతున్నారు. అలాగే వచ్చే ఎన్నికలలో పార్టీ కోసం రూపాయి ఆశించకుండా పనిచేసిన మళ్ళీ అధికారంలోకి వస్తుందనే గ్యారెంటీ లేదు. ఒక వేళ అధికారంలోకి వచ్చిన పార్టీ పరంగా తమకి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది అనే విషయాలపై ఎమ్మెల్యేలు గాని, ఇన్ చార్జ్ లు గాని వారికి భరోసా ఇవ్వడం లేదు.
దీంతో ఇవన్ని దృష్టిలో ఉంచుకొని పైసా రాబడి లేకుండా పార్టీకి జీతం లేని కూలిగా చేయాల్సిన అవసరం తమకి లేదని ఎవరూ ముందుకి రావడం లేదని తెలుస్తుంది. ఈ నేపధ్యంలో కనీసం గృహ సారథుల నియామకం 50 శాతం కూడా పూర్తి కాలేదనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. అయితే జగన్ మాత్రం ఇన్ చార్జ్ ల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. గృహసారథులు ఏర్పాటు చేయకపోతే సీట్లు ఖరారు చేసేది లేదని బెదిరిస్తున్నట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. మరి వైసీపీ అధిష్టానం, జగన్ రెడ్డి గృహ సారథుల వ్యూహం ప్రస్తుతం ఫ్లాప్ షో అయ్యే అవకాశం ఉందనే మాట ఇప్పుడు వినిపిస్తుంది.