అధికార పార్టీ వైసీపీ 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసే సమయంలో ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు. అలా ఇచ్చిన హామీలలో చాలావరకు నెరవేర్చలేదని చెప్పాలి. ఒక్క నవరత్నాలు పేరుతో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ డబ్బులు పంచిపెట్టడం తప్ప గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఇంకేవి కూడా జగన్మోహన్ రెడ్డి అమలు చేయలేదు అని విమర్శలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ ప్రతి ఏడాది రిలీజ్ చేస్తామని చెప్పారు. మూడేళ్ల కాలంలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయలేదు. గ్రామ పంచాయతీలలో ఉద్యోగాలు ఇచ్చి వాటిని చాలా గొప్పగా వైసీపీ ప్రచారం చేసుకుంటుంది.
ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు దాని ప్రస్తావనే ఎత్తలేదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చి సిపిఎస్ కోసం ఆందోళన నిర్వహించారు. ఇక ఉద్యోగుల జీతాల విషయంలో కూడా ప్రతినెల ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. ఇవన్నీ ఓకే ఎత్తయితే అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపానం నిషేధం అనే హామీని పూర్తిగా విస్మరించారు.
మొదటి ఏడాదిలోనే మద్యం ధరలను విపరీతంగా పెంచి మద్య నియంత్రణ చేయడం కోసం పెంచామని చెప్పుకొచ్చారు. అయితే ధరలు పెరుగుతూనే ఉన్నాయి, అలాగే మద్యాన్ని నేరుగా ప్రభుత్వమే విక్రయించడం మొదలుపెట్టింది. కొత్త షాపులను కూడా ఎక్కడికి అక్కడ ఏర్పాటు చేసింది. దీంతో విపక్షాలు అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నాయి. మద్యపాన నిషేధం చేస్తామని జగన్ రెడ్డి మాట చెప్పారని విమర్శిస్తున్నారు. ప్రజలను మద్యానికి బానిస చేయడానికి కొత్త కొత్తగా షాపులను పెంచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే దీనిపై తాజాగా ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మీడియా ముందుకు వచ్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికలకు ముందు ఏనాడు ఒకేసారి మద్యపాన నిషేధం అమలు చేస్తామనే మాట ప్రస్తావించలేదని కొత్త భాష్యం చెప్పుకొచ్చారు. దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తామని మాత్రమే చెప్పామని అన్నారు. అలాగే కొత్తగా బార్లను ఏర్పాటు చేస్తే వాటి సంఖ్య పెరిగినట్లు కాదని అన్నారు.
ఉన్న వాటిలోనే అడ్జస్ట్ చేస్తూ షాపులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మద్యపాన నిషేధంపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయని విమర్శించారు. తాము చెప్పని మాటలు చెప్పినట్లు ఆపాదించి ప్రచారం చేస్తున్నారని అన్నారు. అయితే ఎప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ఉన్నపళంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. బూడి ముత్యాల నాయుడు మీద రాజకీయ వర్గాల్లో ఎలాంటి ఆరోపణలు లేవు. ఈ నేపథ్యంలో వైసీపీలో ఉన్న ఇలాంటి నేతలను తెరపైకి తీసుకువచ్చి ప్రతిపక్షాలపై వైసీపీ అధిష్టానం విమర్శలు చేయిస్తుందని మాట రాజకీయాల్లో వినిపిస్తుంది.