రానున్న ఎన్నికలలో వైసీపీకి కాపులు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయనే మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి. కాపులు కచ్చితంగా పవన్ వెంట నడిచే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. వైసీపీలో ఉన్న కాపు నాయకులు ఎన్ని విధాలుగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దెబ్బ తీసి కాపులని డైవర్ట్ చేయాలని భావిస్తున్నా కూడా అది కాస్తా రివర్స్ అయ్యి పవన్ కళ్యాణ్ పై కాపులలో సింపతీ పెరగడానికి కారణం అవుతుంది. ఇదిలా ఉంటే కాపుల ప్రభావం ఎలాగూ తమకి వచ్చే ఎన్నికలలో ఇబ్బంది అవుతుందని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకుపై వైసీపీ ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది. బీసీలలో కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్నారు.
అయితే వారికి పదవులు ఆశ చూపించడం ద్వారా బీసీ ఓటు బ్యాంకుని తమకి అనుకూలంగా మార్చుకోవాలని జగన్ టీమ్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. ఏపీలో మెజారిటీ ఓటర్లు బీసీలే. వీరిని తమ వైపు తిప్పుకుంటే 2024 ఎన్నికలలో మరల సునాయాసంగా గెలవచ్చు అనే ఆలోచనతో జగన్ ఉన్నారు. ఈ నేపధ్యంలో నామినేటెడ్ పదవులని వారికి ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఎలాగూ ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది కాబట్టి ఇప్పుడు బీసీలని పదవులతో ప్రలోభపెడితే ఎన్నికల ముందు ఉపయోగపడతారని భావిస్తున్నారు. అందులో భాగంగా ఈ సారి టీటీడీ చైర్మన్ పదవిని బీసీలకి ఇచ్చేందుకు జగన్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.
తనకి అనుకూలంగా ఉంటూ తాను చెప్పినట్లు చేసే బీసీ నాయకుడిని వెతికి పట్టుకునే పనిలో జగన్ టీమ్ పడింది. టీటీడీ చైర్మన్ అంటే నిజంగా అత్యున్నత పదవి. అలాంటి పదవిని బీసీలకి ఇచ్చి తాను బీసీలకి పెద్దపీట వేస్తానని చెప్పుకునే ప్రయత్నం చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే సామాజిక సమీకరణాలలో భాగంగా రెండో సారి మెజారిటీ మంత్రి పదవులని బీసీలకి జగన్ రెడ్డి కట్టబెట్టాడు. ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవి కూడా ఇస్తే వారు కచ్చితంగా తనకి అండగా ఉంటారని జగన్ అండ్ కో భావిస్తున్నారు.